ఈ సహజసిద్ధమైన చిట్కాలతో అసిడిటీ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.
ఎసిడిటీ ఈ రోజుల్లో చాలా మందిలో కనిపిస్తోంది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఎసిడిటీ వంటి సమస్యలు వస్తున్నాయి. మన కడుపులో ఉత్పత్తి అయ్యే కొన్ని యాసిడ్లు జీర్ణవ్యవస్థలో క్రియాశీలకంగా పనిచేస్తాయి. ఐతే ఇవి అధికంగా ఉత్పత్తి అయితే జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. తద్వారా మనం తినే ఆహార పదార్థాలు సరిగ్గా అరగవు. అయితే మనలో చాలా మందికి సహజంగానే చాలా సార్లు అసిడిటీ సమస్య వస్తుంటుంది. మసాలాలు, నూనె పదార్థాలు, జంక్ ఫుడ్, ఇతర పదార్థాలను తిన్నప్పుడు సహజంగానే చాలా మందికి అసిడిటీ సమస్య వస్తుంది.
అయితే ఈ సమస్యకు ఇండ్లలో లభించే సహజసిద్ధమైన పదార్థాలే పరిష్కారం చూపుతాయి. అసిడిటీ సమస్య ఉన్న వారికి కడుపులో మంటగా అనిపిస్తుంది. పరగడుపునే అయితే సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల వికారంగా అనిపిస్తుంది. వాంతులు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. జీర్ణాశయంలో గ్యాస్ పేరుకుపోతుంది. కొందరికి లూజ్ మోషన్స్ కూడా అవుతాయి. కొందరికి మలబద్దకం సమస్య ఏర్పడుతుంది. కొందరిలో ఆకలి నశిస్తుంది.
అసిడిటీ సమస్య ఉన్న వారు ఒక టీస్పూన్ వాము తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా నమిలి తినాలి. అనంతరం ఒక గ్లాస్ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల అసిడిటీ సమస్య తగ్గుతుంది. లేదా రాత్రి పూట ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ వామును నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని తాగి ఆ వామును తినాలి. దీంతో కూడా ఆ సమస్య తగ్గుతుంది. భోజనం చేసిన వెంటనే సోంపు గింజలను తిన్నా లేదా వాటితో తయారు చేసిన టీని తాగినా అసిడిటీ సమస్య ఉండదు.
పాలు, పెరుగు సహజసిద్ధమైన అంటాసిడ్‌ల మాదిరిగా పనిచేస్తాయి. అందువల్ల వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే అసిడిటీ సమస్య బాధించదు. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తేనెను కలిపి భోజనం చేసిన వెంటనే తాగాలి. ఇలా చేస్తే అసిడిటీ సమస్య తగ్గుతుంది. ఒక గ్లాస్ మజ్జిగలో చిటికెడు ధనియాల పొడిని కలుపుకుని తాగితే అసిడిటీ సమస్య తగ్గుతుంది. అరటి పండ్లు కూడా సహజసిద్ధమైన అంటాసిడ్‌ల లాగా పనిచేస్తాయి. భోజనం అనంతరం ఒక అరటి పండును తింటే అసిడిటీ సమస్య ఉండదు.