భారీగా పెరుగుతున్న కలరా కేసులు, సంచలన ప్రకటన చేసిన WHO.
విబ్రియో కలరా బ్యాక్టీరియమ్ చిన్న ప్రేవుకు సోకడం వలన వచ్చే తీవ్రమైన అతిసార వ్యాధినే కలరా అంటారు.ఈ అంటు వ్యాధి తరచుగా తక్కువగాను, లేదా లక్షణాలేమీ కన్పించకుండానే వస్తుంది. కానీ కొన్ని సార్లు తీవ్రంగా కూడ వస్తుంది. అయితే 19వ శతాబ్ధంలో కలరా సృష్టించిన కల్లోలం ఇంతా అంతా కాదు. ఆ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందింది. అన్ని దేశాల్లోనూ కలిపి లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంది. మొదట్లో ఇది చెడు గాలుల వల్ల సోకుతుందని భావించారు.
కానీ జాన్ స్నూ అనే వైద్యుడు తాగునీటిలో చేరిన వ్యాధికారక క్రిముల వల్ల ఇది వస్తుందని గుర్తించారు. నీటిలో కలుషితమైన నీటిలో ‘విబ్రియో కలరా’ అనే బాక్టీరియా చేరి ఆ నీటిని కలుషితం చేసిందని గుర్తించారు. ఆ నీటిని తాగడం వల్ల ప్రజలు కలరా బారిన పడుతున్నట్టు తేలింది. కలుషితమైన నీటికి దూరంగా ఉండటం ద్వారా కలరా నుంచి ప్రపంచం మెల్లగా బయటపడింది. కానీ గత 20 ఏళ్లుగా మళ్లీ ప్రపంచ దేశాల్లో కలరా వ్యాప్తి చెందుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఏటా 40 లక్షల మందికి పైగా కలరా సోకుతుందని, వీరిలో 1,43,000 మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు వివరిస్తున్నాయి.
ప్రపంచ దేశాల్లో దాదాపు 30 దేశాలు ప్రస్తుతం కలరా కేసులను ఎదుర్కొంటున్నాయి. పేదరికం, పరిశుభ్రత లేకపోవడం, పేలవమైన పారిశుధ్యం ఇవన్నీ కూడా కలరా వ్యాప్తి చెందడానికి కారణాలుగా మారినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు వివరిస్తున్నారు. ముఖ్యంగా ఆఫ్రికాలోని దేశాల్లోనే కలరా వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఆఫ్రికాలో తుఫానుల సీజన్ మొదలైంది. అంటే వరదలు వస్తాయి. వరదలు వస్తే ఎక్కడకక్కడ నీళ్లు నిలిచిపోతాయి. ఆ నిలిచిపోయిన నీళ్లలో కలరా బ్యాక్టీరియా చేరి ప్రజలకు సోకుతుంది. కాబట్టి కలరా వ్యాప్తి ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు WHO ప్రతినిధులు.
కలరా అనే వ్యాధిని మర్చిపోయిన ప్రపంచం, ఇప్పుడు మళ్లీ దాని గుప్పెట్లోకి వెళుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. మొజాంబిక్ దేశం చెబుతున్న ప్రకారం డిసెంబర్, 2022 నుండి ఆ దేశంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో లేని విధంగా ప్రస్తుతం కేసులు అక్కడ పెరిగాయి. లెబనాన్ కూడా గత 30 ఏళ్లలో తీవ్ర ఆర్థిక పతనాన్ని చూస్తోంది. దీనివల్ల దేశంలో ఎలాంటి పారిశుద్ధ్య కార్యక్రమాలకు నిధులు చేకూరడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చెత్త పేరుకుపోయి, నీరు నిలిచిపోయి, బ్యాక్టీరియాలు, వైరస్‌లకు నివాసాలుగా మారుతున్నాయి. ఆ దేశంలో కూడా ప్రస్తుతం కలరా కేసులు బయటపడుతున్నాయి.
పిల్లలకే ముప్పు.. కలరా అనేది పిల్లలకు, పెద్దలకు కూడా సోకుతుంది. కానీ త్వరగా ఈ కలరా బారిన పడేది ఐదేళ్ల లోపు చిన్నారులే. కలరానే కాదు, నీటి ద్వారా సోకే రోగాల బారిన పడేది ఎక్కువగా ఈ పిల్లలే. వీరికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కలరా సోకిన వారిలో కనిపించే లక్షణాలు స్వల్పంగానే ఉంటాయి. తర్వాత అవి తీవ్రతరం అవుతాయి. కలరా సోకాక కొన్ని గంటల్లోనే చికిత్స అందకపోతే ప్రాణాలు పోయే అవకాశం ఉంది .తీవ్రమైన డయేరియా బారిన పడి శరీరంలోని నీరంతా బయటకు పోతుంది. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కలరా వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుంది.