చల్లటి నీటితో స్నానం చేస్తే గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉందా..?
చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. చల్లటి నీటితో స్నానం చేస్తన్నప్పుడు మొదటగా చర్మానికి రక్త ప్రసరణ తగ్గుతుంది. తర్వాత శరీరం స్వయంగా వేడెక్కవలసి ఉంటుంది. ఈ కారణంగా శరీరంలో రక్త ప్రవాహం పెరుగుతుంది. వ్యాయామం తర్వాత చల్లటి నీటితో స్నానం చేస్తే నాలుగు వారాల తర్వాత కండరాలకు రక్త ప్రసరణ మెరుగుపడిందని ఒక అధ్యయనంలో తేలింది. అయితే చల్లని ఉష్ణోగ్రతలు గుండె, రక్తప్రసరణపై ముఖ్యమైన ప్రభావాలను చూపుతాయి.
ప్రధానంగా చన్నీటి స్నానం వల్ల గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రమాదమని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. చల్లని నీటితో స్నానం చేయటం వల్ల చర్మంలోని రక్తనాళాలు సంకోచించబడతాయి. దీని వల్ల శరీరంలో రక్త ప్రసరణ వేగం తగ్గుతుంది. చల్లని గాలి కన్నా, అత్యంత తక్కువ ఉష్ణోగ్రత కలిగిన నీటితో స్నానం చేయటం వల్ల శరీరంపై ఎక్కవ ప్రభావం ఉంటుంది. చల్లని నీటితో స్నానం చేయటం వల్ల రక్తనాళాలపై భారం పడుతుంది. చల్లని నీరు శరీరానికి తగిలినప్పుడు ఒక్కసారిగా షాక్ తగిలిన భావన కలుగుతుంది.
హార్ట్ బీట్‌లో సైతం తేడా వస్తుంది. ముఖ్యంగా గుండె సమస్యలతో బాధపడేవారు చన్నీటి స్నానం చేయకుండా ఉండటమే ఉత్తమం. వేడి వాతావరణంలో, అకస్మాత్తుగా చన్నీటి స్నానం చేస్తే హార్ట్ ఎటాక్ ప్రమాదం మరింత ఎక్కువ. దీని కారణంగా శ్వాస ఆడకపోవడం, భయాందోళనలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. షవర్ బాత్‌లు, వాటర్ ఫ్లో అధికంగా ఉండే స్నానాలు చేయటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.
చల్లటి నీరు శరీరంపై ఒక్కసారిగా పడటం వల్ల న్యూరోజెనిక్ కార్డియో రెస్పిరేటరీ ప్రతిస్పందనలకు దారితీసి ఆప్రభావంతో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. గుండె జబ్బులతో బాధపడుతున్నవారు సాద్యమైనంత వరకు గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయాలి. నీరు మరీ అంత వేడిగా కూడా ఉండకూడదు. ఇలాంటి వారు షవర్ల క్రింద స్నానం చేయటం ఏమంత మంచి పద్దతి కాదని నిపుణులు అంటున్నారు. చల్లనీటితో స్నానం చేయాలనిపిస్తే ముందుగా కొద్ది మొత్తంలో గోరు వెచ్చని నీటిని శరీరంపై పోసుకున్న తరువాత చల్లనీటితో స్నానం చేయొచ్చు.