తరుముకొస్తున్న తుఫాన్, భారీ రెయిన్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.
తుఫాన్ ప్రభావం ఏపీపైనా పడనుంది. ఆంధ్రప్రదేశ్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. రాగల 24 గంటల్లో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు పడే అవకాశముంది. రాగల 48 గంటల్లో అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో భారీవర్షాలు కురిసే చాన్స్ ఉంది. ఈనెల 30 నుంచి ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే తమిళనాడు పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్‌పైనా ఫెంగల్ తుఫాన్ ప్రభావం తీవ్రంగానే ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
తీరానికి సమీపిస్తున్న కొద్దీ గాలుల వేగం పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏపీలో నేటి నుంచి గాలుల వేగం గంటకు 60 కిలోమీటర్ల వరకు ఉంటుందని రేపటి నుంచి మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. తమిళనాడును ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా రాయలసీమపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరో 48 గంటల తర్వాత ఉత్తరాంధ్రపై కూడా ఫెంగల్ తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలపింది.
నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య , చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో 48 గంటలు దాటిన తర్వాత బాపట్ల, సత్యసాయి, కడప, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. తుఫాన్‌గా మారిన తర్వాత మూడు రోజులకు బలహీనపడి తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటినా మరో మూడు రోజుల పాటు తమిళనాడు, ఏపీలోని పలు ప్రాంతాలకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.
తుఫాన్ ప్రభావంతో వారం రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు ఒకవైపు.. ఇప్పటికే పెరిగిన చలిగాలుల ప్రభావానికి తోడు వర్షాలతో జనం బయటికి రావాలంటేనే వణికిపోతున్నారు. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం అయింది. మరో వారం రోజులు పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం తెలుస్తోంది.