చనిపోయే కొన్ని క్షణాల ముందు ఈ విషయాలు కనిపిస్తాయంట..?
ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మెదడులో ఏమి జరుగుతుందో ఎప్పుడైనా ఊహించారా..? మరణిస్తున్న వ్యక్తి మెదడు స్కాన్‌లో తన జీవితమంతా అనుభవించిన క్షణాలు మెరుపులా కళ్ల ముందుకు వచ్చినట్లు వెల్లడైంది. మరణం, మరణానంతర అనుభవాలను పరిశోధించే సమయంలో మెదడులో ఏమి జరుగుతుంది అనేది శతాబ్దాలుగా న్యూరో సైంటిస్టులను అబ్బురపరిచే ప్రశ్నగానే మారిన క్రమంలో ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్ న్యూరోసైన్స్ అనే జర్నల్ తాజాగా ఓ కీలక అధ్యయానికి సంబంధించిన విషయాలను ప్రచురించింది.
అయితే 87 ఏళ్ల మూర్ఛ రోగి మెదడును స్కాన్ చేస్తున్న సమయంలో అనూహ్యంగా అతడు గుండెపోటుతో మరణించాడు. ఆ రోగి గుండె కొట్టుకోవడం ఆగిపోయిన 30 సెకన్లలో ఆతడి మెదడు కొన్ని జ్ఞాపకాలను రీప్లే చేసినట్లు స్కాన్‌లో కనిపించింది, ఈ పరిశోధన ఫలితాలు ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్ న్యూరోసైన్స్‌లో ప్రచురితమయ్యాయి. వ్యక్తి మూర్ఛలను గుర్తించడానికి, చికిత్స చేయడానికి శాస్త్రవేత్తలు రోగికి ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ (EEG) స్కాన్‌లను నిర్వహిస్తున్నారు. అయితే అదే సమయంలో అతడు ఆకస్మికంగా అప్పటికపుడే మరణించాడు, ఆ సమయంలో, EEG మెషిన్ రన్ అవుతూనే ఉంది.
ఇది శాస్త్రవేత్తలకు మరణిస్తున్న మానవుని మెదడు కార్యకలాపాలపై మొదటిసారిగా రికార్డ్ డాక్యుమెంట్ అందించింది. ఎందుకంటే ఈ సంఘటన చాలా అరుదు, ఎలాంటి ముందస్తు ప్లాన్ చేయలేదు, వేరే ఇతర చికిత్స కోసం స్కాన్ నిర్వహిస్తుండగా రోగి చనిపోయాడు. ఆ సమయంలో స్కానింగ్ లో సాధారణంగా వ్యక్తులు కలలు కనే సమయంలో, అలాగే ధ్యానం చేసే సమయంలో మెదడులో సంభవించే రిథమిక్ వేవ్ నమూనాలను వైద్యులు కనుగొన్నారు.
“మేము వ్యక్తి మరణం సమయంలో 900 సెకన్ల మెదడు కార్యకలాపాలను కొలిచాము, గుండె కొట్టుకోవడం ఆగిపోయే ముందు, ఆ తర్వాత 30 సెకన్లలో ఏమి జరిగిందో పరిశోధించడానికి నిర్దిష్ట ఫోకస్ సెట్ చేసాము” అని ఈ అధ్యయనం రచయితలలో ఒకరైన అజ్మల్ జెమ్మార్ పేర్కొన్నారు. మెదడులో జరిగే కార్యాచరణను మెదడు డోలనాలు లేదా మెదడు తరంగాలు అని పిలుస్తారు.
సజీవంగా ఉండే మానవ మెదడుల్లో సాధారణంగా ఇలాంటి మూడు లయబద్ధమైన తరంగాల నమూనాలు ట్రాక్ చేస్తారు. EEG మెదడు స్కాన్ ఒక ఆసిలేటరీ మెదడు తరంగ నమూనాను కనుగొంది, దీనిలో మెదడుకు సంబంధించిన ఆల్ఫా, బీటా, తీటా బ్యాండ్‌లలో కార్యకలాపాలు సాపేక్షంగా తగ్గాయి, గామా బ్యాండ్‌లో కార్యాచరణ సాపేక్షంగా పెరిగింది. ఈ ఆసిలేటరీ నమూనాలు, గామా తరంగాల పెరుగుదల మెమరీ రీకాల్‌ను సూచిస్తాయని భావించవచ్చు. అంటే చనిపోయే ముందు ఫ్లాషింగ్ నిజమని సైన్స్ పరంగా నిర్ధారణ అయినట్లే.