ఇయర్ ఫోన్లుఎక్కువగా వాడటం వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసా..?
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1.1 బిలియన్ మందిపైగా.. ఎక్కువ సౌండ్‌తో కూడిన సంగీతాన్ని వినడం వల్ల వినికిడి శక్తి తగ్గే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అయితే ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది హెడ్ ఫోన్ల వినియోగంతో వినికిడి లోపం ముప్పు పొంచి ఉంది. BMJ గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. స్మార్ట్‌ఫోన్‌లు, మ్యూజిక్, మూవీలను చాలామంది యువకులు ఈ హెడ్ ఫోన్లతో భారీ సౌండ్ పెట్టుకుని మరి ఎక్కువసేపు వినడం సర్వసాధారణంగా మారిపోయింది.
ప్రపంచవ్యాప్తంగా 12-34 ఏళ్ల వయస్సు గల 0.67 నుంచి 1.35 బిలియన్ల మంది యూజర్లు పెద్దగా వాల్యూమ్ పెట్టుకుని వింటున్నారని అధ్యయనం అంచనా వేసింది. దీని కారణంగా వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉందని ప్రధాన అధ్యయన రచయిత లారెన్ డిల్లార్డ్ ఈమెయిల్ ద్వారా వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు సలహాదారుగా ఉన్న డిల్లార్డ్.. చాలా ఎక్కువ వాల్యూమ్‌తో వినడం వల్ల చెవిలోని ఇంద్రియ కణాలు తీవ్రంగా దెబ్బతింటాయని డిల్లార్డ్ చెప్పారు. చాలా కాలం పాటు ఇలానే కొనసాగితే మాత్రం.. చెవులు శాశ్వతంగా దెబ్బతింటాయని, ఫలితంగా వినికిడి లోపం వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని హెచ్చరించారు.
పరిశోధకులు మూడు డేటాబేస్‌లలో 2000, 2021 మధ్య హెడ్‌ఫోన్‌ల వాడకానికి సంబంధించిన డేటాను విశ్లేషించినట్టు అధ్యయనం తెలిపింది. అధ్యయనం ప్రకారం.. హెడ్‌ఫోన్‌ల వాడకంతో పాటు కచేరీలు, బార్‌లు, క్లబ్‌లు వంటి వినోద కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున లౌడ్ స్పీకర్లను వాడటం కూడా ప్రమాదకరమేనని తేలింది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వారానికి 40 గంటలకు పైగా సురక్షితమైన శబ్ద స్థాయిలను 85 డెసిబుల్స్‌గా పరిమితం చేసింది. మీరు రోజుకు 2½ గంటలు మాత్రమే వింటున్నట్లయితే.. దాదాపు 92 డెసిబుల్స్‌కు సమానమని అధ్యయనం తెలిపింది. MP3 ఆడియో ఫైల్స్‌తో డౌన్‌లోడ్ చేసిన స్మార్ట్‌ఫోన్లలో మ్యూజిక్ తరచుగా 105 డెసిబెల్‌ల వరకు వాల్యూమ్‌లను యూజర్లు ఎంచుకుంటారు.
అదే డీజే ఈవెంట్లలో తరచుగా 104 నుంచి 112 డెసిబుల్స్ వరకు ఉంటాయని అధ్యయనం తెలిపింది. వినికిడి లోపం ముప్పు నుంచి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అధ్యయన పరిశోధకులు సూచించారు. ప్రమాదకరమైన చెవి ఇన్ఫెక్షన్లు ఇవే..ఇయర్ ఫోన్లు లేదా హెడ్ ఫోన్లను నేరుగా చెవిలోకి పెట్టుకోవడం ద్వారా ఇయర్ కెనాల్ దెబ్బతింటుంది. తద్వారా గాలి వెళ్లే మార్గాన్ని బ్లాక్ చేస్తుంది. ఈ బ్లాకేజ్ కారణంగా అనేక రకాల చెవి ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయి. ఎక్కువ గంటల పాటు చెవిలో ఇయర్ ఫోన్లు పెట్టుకుని వినడం ద్వారా చెవిపోటు ఎక్కువగా వచ్చే ప్రధాన సమస్యల్లో ఒకటి. అధిక సౌండ్ లెవల్స్ పెట్టుకోవడం అనేది ఎప్పడూ చేయకూడదు. తక్కువ వాల్యూమ్ మాత్రమే ఉండేలా చూసుకోవాలి.
అదే పనిగా తరచుగా ఇయర్ ఫోన్లను వాడటం వల్ల కళ్లు తిరగడం వంటి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. చెవిలోని ఇన్నర్ ఇయర్ అనేది చాలా సున్నితమైన భాగం.. హెడ్ ఫోన్ల నుంచి అధిక మొత్తంలో ధ్వని వస్తే.. అది దెబ్బతిని వినికిడి కోల్పోయే ప్రమాదం ఉంది. లౌడ్ సౌండ్ వినడం ద్వారా సున్నితమైన చెవిలోని కణాలు దెబ్బతిని.. శాశ్వతంగా వినికిడిని కోల్పోతారు. చెవుల ద్వారా అధిక స్థాయిలో ధ్వని నేరుగా మెదడుకు చేరుతుంది. తద్వారా నాడి వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. దాంతో దృష్టిలోపంతో పాటు ఏకాగ్రత కోల్పోతారు.