షుగర్ పేషెంట్స్ మద్యం తాగితే ఏం జరుగుతుందో తెలుసుకోండి.
డయాబెటిస్ రావడానికి ఎక్కువగా ఆహార పదార్థాలే కారణమవుతున్నాయి. కాబట్టి కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు ఎక్కువగా ఉండి షుగర్ వ్యాధిని పెంచే వాటి జోలికి వెళ్లకుండా ఉండాలి. సహజ సిద్దమైన మందులను ఉపయోగిస్తూ తగిన ఆహారాన్ని తీసుకుంటూ షుగర్ వ్యాధిని తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే మధుమేహం ఉన్నవారు అసలు మద్యం తాగనే కూడదని.. దీనికి ఎలాంటి మినహాయింపులు లేవని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. మధుమేహానికి మద్యం తోడైతే అగ్నికి ఆజ్యం పోసినట్టేనని చెబుతున్నారు.
ఎందుకంటే మద్యంతో నాడులు దెబ్బతింటాయని.. మామూలుగానే మధుమేహులకు నాడులు దెబ్బతినే ముప్పు ఎక్కువ అని తెలిపారు. ఎంత ఎక్కువకాలం నుంచి మధుమేహంతో బాధపడుతుంటే అంత ఎక్కువగా నాడులు దెబ్బతినే ప్రమాదముందని.. దీని మూలంగానే చాలామంది కాళ్లు చేతుల తిమ్మిర్లు, మంట పెట్టటం, సూదులు పొడిచినట్టు అనిపించటం వంటి వాటితో బాధపడుతుంటారని అన్నారు. దీనికి మద్యం కూడా తోడైతే సమస్య మరింత తీవ్రమవుతుందని.. ఇంకాస్త త్వరగా నాడులు దెబ్బతినొచ్చని హెచ్చరించారు.
ఒకవేళ ఎప్పుడైనా మద్యం తాగాల్సి వస్తే విధిగా భోజనం చేసి ఆ తర్వాత మాత్రలు వేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. “మద్యం తాగాక భోజనం చేయకపోతే మందులు వేసుకోవద్దు. మామూలుగా కాలేయం నిరంతరం గ్లూకోజును ఉత్పత్తి చేస్తూ.. రక్తంలో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉండేలా చూస్తుంది. మద్యంలోని ఆల్కహాల్ ఈ ప్రక్రియను దెబ్బతీస్తుంది. దీంతో తగినంత గ్లూకోజు ఉత్పత్తి కాదు. ఫలితంగా గ్లూకోజు మోతాదులు పడిపోతాయి. ఆల్కహాల్ తాగాక భోజనం చేస్తే ఇది కొంతవరకు కుదురుకుంటుంది. అయితే చాలామంది భోజనం చేయరు.
దీంతో గ్లూకోజు మోతాదులు పడిపోయి హైపోగ్లైసీమియాలోకి వెళ్లిపోవచ్చు. ఇది చాలా ప్రమాదకరం. సత్వరం చికిత్స లభించకపోతే ప్రాణాంతకంగానూ పరిణంచొచ్చు.” అని నిపుణులు చెప్పారు. “ఇక ఇతరత్రా మందులు విషయంలో- యాంటీబయాటిక్స్, నొప్పిని తగ్గించే మందుల వంటివి జీర్ణాశయ పూత (గ్యాస్ట్రయిటిస్) సమస్యకు దారితీస్తాయి. మద్యం కూడా దీన్ని తెచ్చిపెట్టొచ్చు. మందులు, మద్యం రెండూ కలిస్తే సమస్య ఇంకాస్త ఎక్కువవుతుంది. దీంతో ఛాతీలో మంట, వాంతులు తలెత్తొచ్చు. కొందరికి రక్తం వాంతులూ కావొచ్చు. కాబట్టి మందులు వేసుకునేటప్పుడు మద్యం జోలికి వెళ్లకూడదని గుర్తుంచుకోవాలి.”అని నిపుణులు చెబుతున్నారు.