జ్వరం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితిలో వీటిని తినొద్దు, తిన్నారంటే..?
జబ్బు చేస్తే శరీరం ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఎందుకంటే వ్యాధితో పోరాడటానికి శరీరంలో హెచ్చు ఉష్ణోగ్రత మేలు చేస్తుంది. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నపుడు శరీరంలో విడుదలయ్యే హార్మోనులు, ఎంజైములు లాంటి రసాయనాల స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇవి వ్యాధితో పోరాటానికి పనికి వస్తాయి. అలాగే రక్త కణాలు అధికంగా విడుదలవుతాయి. వ్యాధి క్రిములను నాశనం చేయడానికి ఇవి అవసరం. రక్త ప్రసరణ మెరుగు అవుతుంది. ఊపిరి వేగం పెరుగుతుంది.
దీని వల్ల శరీరంలో ఉండే విష పదార్థాలు తొందరగా బయటికి వెళ్ళిపోతాయి. అయితే జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే జ్వరం వచ్చినప్పుడు శరీరం నీరసంగా మారుతుంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలి. పుష్కలంగా నీరు, కొబ్బరి నీరు, పండ్ల రసాలను తాగాలి. ఇవి మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. ఇది మిమ్మల్ని త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. జ్వరం వచ్చినప్పుడు ఎంత కారం కారంగా తినాలనిపించినా.. జంక్ ఫుడ్ ను మాత్రం ఎట్టి పరిస్థితిలో తినకూడదు.
ఎందుకంటే జంక్ ఫుడ్ లో కార్భోహైడ్రేట్లు, కేలరీలు, మసాలా దినుసులు, నూనె ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇలాంటి సమయంలో అవి అంత త్వరగా జీర్ణం కావు. ఇవి జీవక్రియను బలహీనపరుస్తాయి. జ్వరం వచ్చినప్పుడు సాదాసీదాగా ఆహారాన్నే తినాలి. కారంగా ఉండే ఆహారాలను అస్సలు తినకూడదు. కారంగా ఉండే ఆహారాలను తినడం వల్ల మీ శరీరంలో నిర్జలీకరణం ఏర్పడుతుంది జ్వరం కూడా పెరుగుతుంది. జ్వరంలో మీరు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తినాలి. ఎందుకంటే ఇలాంటి సమయంలో జీర్ణ వ్యవస్థను బలహీనంగా ఉంటుంది.
అందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల జీర్ణంలో ఎక్కువ శక్తి వినియోగించబడుతుంది. దీనివల్ల మీరు రికవరీ అవడం లేటవుతుంది. శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. కాబట్టి జ్వరం ఉన్నప్పుడు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తినకండి. జ్వరంగా ఉన్నప్పుడు పాలను గానీ.. పాల ఉత్పత్తులను గానీ తీసుకోవడాన్ని తగ్గించాలి. ఎందుకంటే వీటిని జీర్ణం చేయడానికి శక్తి ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాగే జీర్ణక్రియ సరిగ్గా పనిచేయదు. దీనివల్ల మలబద్దకం సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
జ్వరంగా ఉన్నప్పుడు కెఫిన్ ఉండే టీ, కాఫీ, ఆల్కహాల్ ను అస్సలు తాగకూడదు. ఎందుకంటే ఇది మీ శరీరాన్ని డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను కూడా బలహీనపరుస్తుంది. అందుకే జ్వరం ఉన్నప్పుడు వీటి జోలికి వెళ్లకండి. కావాలనుకుంటే 1 నుంచి 2 కప్పుల బ్లాక్ టీ లేదా కాఫీనిన తాగొచ్చు. జ్వరం వస్తే నోరంతా చేదుగా అనిపిస్తుంది. అందుకే చాలా మంది తీపి పదార్థాలను తింటుంటారు. కానీ జ్వరం వచ్చినప్పుడు స్వీట్ ఐటమ్స్ ను తినడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఇది మీ రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. వీటికి బదులుగా కొబ్బరి నీరు, పండ్ల రసాలను తాగండి.