అమెరికా నుంచి అక్రమ వలసల గెంటివేత షురూ, 205 మందితో అప్పుడే విమానం ల్యాండింగ్.

చరిత్రలోనే తొలిసారిగా మిలటరీ విమానాల్లో అక్రమ వలసదారులను, వారివారి దేశాలకు తరలిస్తోంది. ఈ డిపోర్టేషన్ ప్రక్రియలో భాగంగా లేటెస్టుగా 205 మంది భారతీయులను వెనక్కి పంపించింది. టెక్సాస్ నుంచి అమెరికా సీ-17 మిలటరీ విమానంలో వాళ్లను భారత్‌కు తరలించారు. అయితే అమెరికాలో అక్రమ వలసదారులపై అణచివేత ప్రారంభమైంది. డాలర్ల మోజులో అభద్రత, భయంతో జీవిస్తూ వచ్చిన అక్రమ వలసదారులు ఇక ఇండియాకు వచ్చేస్తున్నారు. చరిత్రలో తొలిసారిగా మిలిటరీ విమానాల్లో అక్రమ వలసదారుల్ని స్వదేశాలకు తరలించే ప్రక్రియ ప్రారంభించింది.
అమెరికా సీ 17 యుద్ధ విమానంలో 205 మంది వలసదారుల్ని ఇండియాకు తరలించారు. శాన్ ఆంటోనియో నుంచి బయలుదేరిన తొలి విమానం అమృత్‌సర్‌లో ల్యాండ్ అయింది. తొలి దశలో 20 వేలమంది భారతీయుల్ని తరలించేందుకు అమెరికా సిద్ధమైంది. తొలి విమానం అమృతసర్‌కే ఎందుకంటే ఆ దేశంలో అక్రమంగా వలస ఉంటున్నవారిలో అగ్రస్థానం పంజాబీలు కాగా రెండో స్థానంలో గుజరాతీలున్నారు. వీళ్ళంతా వేర్వేరు సమయాల్లో డంకీ రూట్‌లో అక్కడికి వలసవెళ్లినవాళ్లే.
అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మొత్తం 20 వేల మంది డాక్యుమెంట్లు లేని భారతీయుల జాబితాను రూపొందించింది. ముందుగా టెక్సాస్‌లోని ఎల్ పాసూ, కాల్నిఫోర్నియాలోని శాన్ డియాగో నుంచి 5 వేలమందిని బహిష్కరించాలని పెంటగాన్ నిర్ణయించింది. మెక్సికో, ఎల్ సాల్వడార్ తరువాత భారీ సంఖ్యలో అక్రమ వలసదారులు ఇండియా నుంచే ఉన్నారు. అక్రమ వలసదారులపై నిఘా పెట్టిన అమెరికా ఖర్చుకు వెనుకాడటం లేదు. ఎన్నడూ లేనంత ఖర్చు పెట్టి వలసదారుల్ని ఆయా దేశాలకు యుద్ధ విమానాల్లో తరలింపు ప్రారంభించింది.
అమెరికా నుంచి ఇండియాకు తరలించేందుకు ఒక్కొక్కరిపై 4 వేల 675 డాలర్లు అంటే 4 లక్షల 6 వేల రూపాయలు ఖర్చు చేస్తోంది. తొలి దశలో వచ్చిన 205 మందిపై అప్పుడే 8 కోట్ల 33 లక్షల రూపాయలు వెచ్చించింది. మొత్తం 7.25 లక్షల మందిని తరలించేందుకు వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైంది.