6 గంటలు కంటే తక్కువ నిద్రపోయేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.

నిద్ర ఒక శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి. ఇది జంతువులలోనే కాకుండా పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు, చేపలలో కూడా కనిపిస్తుంది. మనుషులు, ఇతర జంతువులలో దైనందిక నిద్ర బ్రతకడానికి అవసరం. మానవ జీవితంలో నిద్ర ప్రాథమిక అవసరమని, శారీరకపరంగా అత్యంత ముఖ్యమైనదని, నిద్ర పౌరుల ప్రాథమిక హక్కని, ఆరోగ్య జీవనానికి చాలా అవసరమైనదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అవసరానుగుణంగా నిద్ర, నిశ్శబ్దం, విశ్రాంతి ఆరోగ్య రీత్యా మానవులకు తప్పనిసరి అవసరమని, నిశ్శబ్దం బంగారం లాంటిదని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే రోజుకు మీరు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు? పగలు ఎన్ని గంటలు? రాత్రి ఎన్ని గంటలు? కనీసం ఆరు గంటలైన నిద్రపోతున్నారా? లేదంటే.. మీ హెల్త్ డేంజర్ జోన్ లో ఉన్నట్టే. అవును. ఇది నిజమేనని ఓ అధ్యయనం వెల్లడించింది.

రోజు మొత్తంలో కనీసం ఆరు గంటలైన నిద్రపోని వారిలో గుండెకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందట. నిద్రలేమి కారణంగా తీవ్ర ఒత్తిడి పెరగడమే కాకుండా అది శరీరంలోని రక్తప్రసరణపై ప్రభావం చూపిస్తుందని తెలిపింది. తద్వారా రక్తనాళాల్లో ఒత్తిడి ఏర్పడి అది మెల్లగా గుండెపై ప్రభావం చూపిస్తుందని పేర్కొంది.

ముఖ్యంగా రాత్రివేళల్లో నిద్ర ఎంతో మంచిదని అధ్యయనంలో రుజువైంది. ఇటీవల పరిశోధకులు మధ్య వయస్సు ఉన్న 4వేల మంది పురుషులు, మహిళల్లో రక్తనాళాల పనితీరును పరీక్షించారు. ఈ అధ్యయనంలో రాత్రివేళల్లో ఆరు గంటలు కంటే తక్కువ సమయం నిద్రించినవారిలో 27 శాతం మేర గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నట్టు నిర్ధారించారు.

ఆరు కంటే ఏడు గంటల వరకు నిద్రించిన వారిలో కంటే తక్కువ సమయం నిద్రించినవారిలోనే ఈ సమస్య తీవ్రంగా ఉంటుందని గుర్తించారు. అందుకే సరైన నిద్ర అవసరం. ఎంత ఒత్తిడి ఉన్నా.. ఎన్ని పనులు ఉన్నా.. నిద్రించే సమయాన్ని కాస్త కేటాయిస్తే.. ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చునని పరిశోధకులు సూచిస్తున్నారు. కంటి నిండ నిద్ర లేదంటే అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.