Health

నోటి పరిశుభ్రత పాటించకపోతే ఆ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

మన నోరు పరిశుభ్రంగా ఉంటేనే, మనం ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. అంటే, మన నోరు పరిశుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యం శుభ్రంగా ఉంటుందన్నమాట. ఏదైనా జ్వరం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ముందు నోరు తెరవమనడానికి కారణం అదే. అయితే నోటిని, దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బ్లాక్ ఫంగస్, కరోనా వంటి వ్యాధులతో పోరాడటానికి దంతాల పరిశుభ్రత కీలక పాత్ర పోషిస్తుంది. దంతాలను సరిగ్గా క్లీన్ చేయకుంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. దీంతో ఎన్నో రకాల రోగాలు చుట్టుకునే ప్రమాదం ఉంది. దంత సంరక్షణ వ్యాధుల బారిన పడే ప్రమాదాలను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల కాలెయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేలింది. క్వీన్స్ యూనివర్శిటీ బెల్ఫాస్ట్ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. దీని ప్రకారం.. చిగుళ్లలో రక్తస్రావం, నొప్పి, నోటి పూతల, దంతాలు లోపించడం వంటి నోటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు హెపాటోసెల్యూలార్ కార్సినోమాకు 75 శాతం ఎక్కువ ప్రమాదం ఉందని పరిశోధకులు కనుగొన్నారుు. ఇది ప్రాథమిక కాలెయ క్యాన్సర్ సాధారణ రూపం. దంతాల ఆరోగ్య సమస్యలు, పెద్దపేగు, కాలేయం, పురీషనాళం, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ల వంటి జీర్ణశయాంతర క్యాన్సర్ల ప్రమాదం మధ్యనున్న సంబంధాన్ని కనుగొనడానికి యుకెలోని 469,000 మందికి పైగా ప్రజలను సెలక్ట్ చేశారు.

దీనిలో పాల్గొన్న వారిలో ఆరేండ్ల కాలంలో 4,069 మంది జీర్ణశయాంతర క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. వీరిలో 13 శాతం మంది రోగులు నోటిని ఆరోగ్యంగా ఉంచుకోలేదని నిపుణులు కనుగొన్నారు. దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, మధుమేహం వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ సంజీవ్ కుమార్ చెప్పారు. నోటిని పరిశుభ్రంగా ఉంచుకోని యువకులు, మహిళలు, వెనుకబడిన ప్రాంతాల్లో నివసించే వారే దీనిబారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని కనుగొన్నారు.

కాలేయం మన శరీరంలోని బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడుతుంది. సిర్రోసిస్, హెపటైటిస్ లేదా క్యాన్సర్ వంటి వ్యాధులు కాలేయాన్ని ప్రభావితం చేసినప్పుడు దీని పనితీరు దెబ్బతింటుంది. మైక్రోబయోమ్, కాలేయ క్యాన్సర్ గురించి మరిన్ని అధ్యయనాలు అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. కామెర్లు, బరువు తగ్గడం, పొత్తి కడుపులో వాపు వంటి లక్షణాలు కాలేయ క్యాన్సర్ తో ముడిపడి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆకలి కూడా ఉండదు. కొద్దిగా తిన్నా.. కడుపు నిండిన భావన కలుగుతుంది. ఈ వ్యాధి లక్షణాలలో పొత్తి కడుపు కుడి వైపున ఒక గడ్డ లాంటిది, కుడి భుజంలో నొప్పి, దురద కూడా ఉండే అవకాశం ఉంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker