మీరు పదే పదే ఫోన్ చూస్తున్నారా..? నోమోఫోబియా వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది.
ప్రస్తుత దైనందిన జీవితంలో రోజులో 24 గంటలూ విశ్రాంతి లేకుండా గడిపే ప్రస్తుతతరం ఇప్పటికే సరికొత్త ఒత్తిడి భారంలో పడి నలుగుతోంది. ఆ ఒత్తిడి ముద్దుపేరు నోమోఫోబియా. ఇది మొబైల్‌ఫోన్ విరివిగా వాడే వారిలో ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు చెపుతున్నారు. అయితే నోమోఫోబియా అంటే ఏమిటి.. తమ మొబైల్ ఫోన్‌ల నుంచి దూరంగా ఉండాల్సి వస్తుందేమోననే కలిగే భయాన్నే నోమోఫోబియా అంటారు. ఇది మానసిక స్థితి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఇది ఒక రకమైన ఆందోళన రుగ్మతగా చెప్పవచ్చు.
ఈ సమస్య ఉన్న వ్యక్తులు తమ ఫోన్‌లలో బ్యాటరీ అయిపోయినప్పుడు, సెల్యులార్ కవరేజ్ లేనప్పుడు లేదా ఫోన్ పోయినప్పుడు చాలా ఆందోళన చెందుతారు. అసలు ఈ పదం ఎక్కడది..నోమోఫోబియా మొదటిసారిగా UK పోస్టల్ ఆఫీస్ ద్వారా 2008 అధ్యయనంలో ఉపయోగించారు. 2100 కంటే ఎక్కువ మంది పెద్దల నమూనాను తీసుకున్న ఈ అధ్యయనంలో 53% మంది ఈ పరిస్థితిని అనుభవించారని తేలింది. ఈ భయం చాలా శక్తివంతమైనదని, వారు తమ పరికరాన్ని ఉపయోగించనప్పటికీ.. వారి ఫోన్‌ను ఆఫ్ చేయడం అసాధ్యం అని కూడా అధ్యయనం వెల్లడించింది. ఈ సమస్య సంకేతాలు, లక్షణాలు ఏమిటంటే..
ఫోన్‌ని ఆఫ్ చేయలేకపోవడం, మిస్డ్ కాల్‌లు, మెసేజ్‌లు లేదా ఇమెయిల్‌ల కోసం మీ ఫోన్‌ను నిరంతరం తనిఖీ చేయడం లేదా ఇంటర్నెట్ నుంచి డిస్‌కనెక్ట్ కావడం గురించి ఆందోళన చెందడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. భావోద్వేగ, అభిజ్ఞా లక్షణాలతో పాటు.. బ్రీతింగ్ సమస్యలు, హృదయ స్పందన రేటు పెరగడం, విపరీతమైన చెమటను మీరు అనుభవించవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో ఇది తీవ్ర భయాందోళనలకు కూడా దారి తీస్తుంది. నోమోఫోబియాకు కారణమేమిటి.. ఆధునిక డిజిటల్ టెక్నాలజీ యుగంలో చాలా మంది ఫోన్ ప్రపంచంలోనే పుట్టి పెరుగుతున్నారు. కాబట్టి ఈ పరికరాలు దాదాపు వారి శరీరంలో అంతర్భాగంగా మారాయి.
వ్యాపారాన్ని నిర్వహించడానికి, వ్యవస్థీకృతంగా ఉండటానికి, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడానికి, ఆర్థిక లావాదేవీలకై.. స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. వాటి వైవిధ్యమైన ఉపయోగాల కారణంగా.. ప్రజలు దానిపై ఎక్కువ ఆధారపడిపోయారు. దీనిని ఎలా కంట్రోల్ చేయవచ్చు..మీరు నోమోఫోబియా సంకేతాలు, లక్షణాలను కనుగొంటే.. అది మీ రోజువారీ జీవితంలో సమస్యలను కలిగిస్తుంటే.. మీరు మానసిక ఆరోగ్య నిపుణులతో మాట్లాడటం మంచిది. ఈ పరిస్థితికి నిర్దిష్ట చికిత్స అందుబాటులో లేదు. అయితే మీ థెరపిస్ట్ మీ లక్షణాలను పరిష్కరించడానికి ఎక్స్‌పోజర్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ లేదా రెండింటినీ సిఫారసు చేయవచ్చు. అరుదైన సందర్భాల్లో మీకు మందులు కూడా సూచించే అవకాశముంది.