ఇలాంటి పచ్చి అరటిపండ్లు తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువ.
భోజనం అందుబాటులో లేనపడు రెండు అరటి పండ్లు తింటే ఆకలి తీర్చుకుంటారు. ఇది సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటుంది. అరటి పండులో చాలా పోషకాలుంటాయి. ముఖ్యంగా B6, విటమిన్ C పుష్కలంగా ఉంటాయి. మెగ్నిషియం, పొటాషియం మాంగనీస్, ఫైబర్ లు అరటి పండులో మెండుగా ఉంటాయి. అరటి పండును మితంగా తింటే నష్టమేమీ ఉండదు.
రోజుకి రెండు లేదా మూడు పండ్లు తింటే సమస్య ఉండదని డాక్టర్లు చెబుతారు. అయితే ఫైబర్ అధికంగా ఉండే సమతులాహారాన్ని తీసుకుంటే ముందుముందు తీవ్ర అనారోగ్యాల బారినపడకుండా ఉండవచ్చని మరోసారి వెల్లడైంది. ముఖ్యంగా జీర్ణకోశ క్యాన్సర్ల ముప్పును నివారించేందుకు ప్రాసెస్డ్ ఫుడ్, ఫైబర్ తక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలని చెబుతారు.
ఇక వారసత్వంగా సంక్రమించే కొన్ని రకాల క్యాన్సర్లను నియంత్రించేందుకు కొద్దిగా పచ్చిగా ఉండే అరటిపండును రోజూ తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. పూర్తిగా మగ్గని అరటిపండ్లు క్యాన్సర్లను ప్రధానంగా జీర్ణకోశ క్యాన్సర్ల ముప్పును తగ్గిస్తాయని తాజా అధ్యయనంలో నిగ్గు తేలింది. మగ్గని అరటిపండ్లలో ఉండే పిండి పదార్ధం పలు క్యాన్సర్లు సోకే ముప్పును 60 శాతానికి పైగా నివారిస్తాయని 20 ఏండ్ల పాటు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
యూనివర్సిటీస్ ఆఫ్ న్యూకాజిల్, లీడ్స్‌కు చెందిన నిపుణుల నేతృత్వంలో సాగిన ఈ అధ్యయన వివరాలు క్యాన్సర్ ప్రివెన్షన్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ప్రేవుల పైభాగంలో వచ్చే క్యాన్సర్లను కనుగొని గుర్తించడం కష్టమని వైద్యులు చెబుతున్న ఈ తరహా క్యాన్సర్లపై తాజా పరిశోధన సానుకూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.