పాము కరిచిన వెంటనే ఇలా చేసి మీ ప్రాణాలు కాపాడుకోవచ్చు. నిర్లక్ష్యం చేస్తే..?
పాము కాటేసినప్పుడు అది విషపూరితమైన పాము కాకపోతే పెద్దగా ఇబ్బంది ఉండదు. విషపూరితమైన పామైతే… క్షణక్షణం మృత్యువు తరుముకొస్తూ ఉంటుంది. ప్రాణాలు దక్కించుకునేందుకు గట్టిగా ప్రయత్నించాలి. అలా చెయ్యాలంటే విషపూరితమైన పాము కాటు వేస్తే… వెంటనే మనలో ఎలాంటి మార్పులు వస్తాయో మనకు తెలియాలి. అయితే భారతదేశంలో ప్రతి సంవత్సరం పాము కాటు కారణంగా చాలా మంది చనిపోతారు. ఇక్కడి ఉష్ణోగ్రతలు పాముల జీవనానికి అనుకూలంగా ఉంటాయి. పాములు ముఖ్యంగా పంట పొలాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
వాస్తవానికి ఇవి ఎలుకలని తినడానికి అక్కడికి వస్తాయి. కానీ మనుషులు ఎదురుపడేసరికి భయంతో కాటువేస్తాయి. అయితే పాము కరిచినప్పుడు ఏమి చేయాలో ఏమి చేయకూడదో చాలామందికి తెలియదు. పాము కరిచినప్పుడు ఈ పనులు చేయాలి.. పాము కాటుకు గురైన వ్యక్తి చేతులకి ఉన్న గడియారం, బ్రాస్లెట్ వెంటనే తీయాలి. అలాగే కాళ్లకి కడియాలు కానీ మరేవైనా ఆభరణాలు ఉంటే తీసేయాలి. సాధారణంగా పాము కాటువేసిన ప్రదేశంలో వాపు ఉంటుంది.
తర్వాత ఇలాంటి వస్తువులని తీయడం కష్టమవుతుంది. పాము కాటు వేసిన శరీర భాగాన్ని ఎక్కువగా కదిలించకూడదు. దీనివల్ల విషం శరీరం మొత్తం వ్యాపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పాము కాటుకు అస్సలు భయపడకూడదు. ఎందుకంటే భయాందోళన కారణంగా బీపీ వేగంగా పెరుగుతుంది. దీనివల్ల విషం త్వరగా వ్యాపిస్తుంది. వీలైనంత ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. పాము కాటుకు గురైన ప్రాంతాన్ని నెమ్మదిగా సబ్బుతో శుభ్రంగా కడగాలి. దీనివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
ప్రథమ చికిత్స చేసిన తర్వాత బాధితుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించాలి. వీలైతే కాటు వేసిన పామును గుర్తించడం కానీ దానిని ఫోటో తీయడం కానీ చేయాలి. దీనివల్ల వైద్యుడికి సరైన ఔషధం ఇవ్వడం సులభం అవుతుంది. పాము కాటువేసినప్పుడు ఈ పనులు చేయకూడదు.. పాము కాటు వేసిన శరీర భాగంలో ఐస్‌గడ్డ, వేడినీరు, చల్లటి వస్తువులను పెట్టకూడదు. పాము కాటువేసిన ప్రదేశంలో గట్టిగా కట్టుకట్టకూడదు. అలాగే పాము కాటు వేసిన భాగంలో కోత పెట్టకూడదు. పాముకాటు వేసిన వ్యక్తిని కదలకుండా చూసుకోవాలి. పాము కాటుకు గురైన వ్యక్తి నిద్రపోకుండా చూడాలి.