షుగర్ మందులు వాడుతున్నారా..? ఈ విషయం మీకోసమే.
డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు. డయాబెటిస్ అని కూడా అనబడే ఈ వ్యాధి, ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత. అయితే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. షుగర్ వ్యాధిని అదుపులో పెట్టేందుకు వాడే సిటాగ్లిప్టిన్ ట్యాబ్లెట్ జనరిక్ వర్షన్స్‌ని తక్కువ ధరకే కేంద్ర ప్రభుత్వం అందించనుంది. భారతదేశంలోని 8,700 జన్ ఔషధి కేంద్రాల్లో తక్కువ ధరకే సిటాగ్లిప్టిన్ ట్యాబ్లెట్స్ లభిస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
రక్తంలో హై గ్లూకోజ్ లెవెల్స్ అంటే హైపర్‌గ్లైసీమియా చికిత్సలో భాగంగా సిటాగ్లిప్టిన్ మెడిసిన్ ఉపయోగిస్తారు. DPP-4 నిరోధకాల్లో సిటాగ్లిప్టిన్ డ్రగ్ ఒకటి. ఈ డ్రగ్‌ను తయారు చేసిన మెర్క్ దగ్గర సిటాగ్లిప్టిన్ పేటెంట్ ఉంది. జనువియా బ్రాండ్ పేరుతో అందుబాటులో ఉండేది. ఇటీవలే పేటెంట్ గడువు ముగిసింది. దీంతో భారతీయ ఔషధ తయారీదారులు సిటాగ్లిప్టిన్ జనరిక్ వర్షన్స్ తయారు చేస్తున్నారు. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాసూటికల్స్ ఆధ్వర్యంలోని ఫార్మాసూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా కూడా జనరిక్ మందులు తయారు చేస్తోంది.
టైప్ 2 డయాబెటిస్ ఉన్న పెద్దవారిలో గ్లైసెమిక్ నియంత్రణను మెరుగుపరచడానికి డైట్, వ్యాయామంతో పాటు సిటాగ్లిప్టిన్‌ను వైద్యులు సూచిస్తారని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాసూటికల్స్ వెల్లడించింది. వృద్ధుల్లో ఈ మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయని చెన్నైకి చెందిన ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వీ.మోహన్ మనీకంట్రోల్‌తో అన్నారు. PMBI తయారు చేసే సిటాగ్లిప్టిన్ జనరిక్ మెడిసిన్ బ్రాండెడ్ మందుల కన్నా 60 శాతం నుంచి 70 శాతం తక్కువకే లభిస్తాయి. మార్కెట్లో మెడికల్ స్టోర్స్‌లో బ్రాండెడ్ మెడిసిన్ రూ.162 నుంచి 258 మధ్య ఉంటే, ప్రభుత్వం నిర్వహిస్తున్న జనరిక్ మెడికల్ స్టోర్స్‌లో 10 ట్యాబ్లెట్స్ ఉన్న సిటాగ్లిప్టిన్ స్ట్రిప్ రూ.60 నుంచి రూ.100 మధ్య లభిస్తుంది.
ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాల ఏర్పాటు 2014-15 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. జన్ ఔషధి కేంద్రాల్లో ప్రజలకు తక్కువ ధరకే జనరిక్ మెడిసిన్ అందిస్తోంది. 2024 మార్చి నాటికి మొత్తం 10,000 జన్ ఔషధి కేంద్రాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. బయటి మార్కెట్‌తో పోలిస్తే జన్ ఔషధి కేంద్రాల్లో జనరిక్ మెడిసిన్ 50 శాతం నుంచి 90 శాతం తక్కువ ధరకే లభిస్తాయి. 1600 పైగా మందులు, 250 పైగా సర్జికల్ డివైజ్‌లు, న్యూట్రాసూటికల్, ఆయుష్ ప్రొడక్ట్స్ లభిస్తాయి. జన్ ఔషధి కేంద్రాల్లో సువిధ శానిటరీ ప్యాడ్స్ కేవలం ఒక్క రూపాయికే లభిస్తోంది.