‘స్లీప్ డివోర్స్’ అంటే ఏమిటి..? ఈ తరహా విడాకులు గురించి భార్యాభర్తలు చేస్తున్న తప్పులు ఇవే.
జంటలు ఇలా విడివిడిగా నిద్రపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. భాగస్వామికున్న కొన్ని అలవాట్ల కారణంగా తోటి భాగస్వామి కలత చెందుతారు. ఇటువంటి అలవాట్లలో బిగ్గరగా గురక పెట్టడం లేదా ఎక్కువ సేపు లైట్లు వేసుకుని మెలకువగా ఉండడం మొదలైనవి ఉంటాయి. పెళ్లయిన జంటలు ఇలా విడివిడిగా నిద్రించడాన్ని స్లీప్ డివోర్స్ అని అంటారు. అయితే ఇటీవల కాలంగా ఇంటర్నెట్లో, సోషల్ మీడియా వెబ్‌సైట్‌లలో ఎక్కువగా శోధిస్తున్న అంశాలలో ‘స్లీప్ డివోర్స్’ కూడా ఒకటి. ఇదేమిటంటే భార్యాభర్తలు ఇద్దరూ వేర్వేరు మంచాలలో విడివిడిగా నిద్రపోవడం.
ఇలా నిద్రించేటపుడు వేరుగా పడుకోవడం వలన నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని కొంతమంది కపుల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇలా ఒకరిని చూసి ఒకరు హ్యాష్‌ట్యాగ్ స్లీప్ డివోర్స్ పేరిట అనేక మంది తమ అనుభవాలను పంచుకున్నారు. విడివిడిగా నిద్రపోవడం వలన ఎలాంటి ఆటంకాలు లేకుండా హాయిగా నిద్రపోగలుగుతున్నట్లు చెప్పుకొచ్చారు. భాగస్వాములు ఇద్దరు కలిసి పడుకున్నప్పుడు ఒకరు గురకపెట్టడం, కాళ్లు చేతులు వేయడం, మంచంపై స్థలం సరిపోకపోవడం, తరచూ లేవడం మొదలైన కారణాల వలన నిద్రకు భంగం వాటిళ్లడం సహజం.
అయితే దీనిని అధిగమించేందుకు విడివిడిగా పడుకోవడం మేలని కొందరు చెబుతున్నారు. ప్రత్యేక పడకలలో పడుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు, కొన్ని అప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రముఖ సైకోథెరపిస్ట్ చాందినీ తుగ్నైట్ M.D. స్లీప్ డివోర్స్ ప్రయోజనాల గురించి చర్చించారు. అవేమిటో ఇక్కడ తెలుసుకోండి. మెరుగైన నిద్ర నాణ్యత..స్లీప్ డివోర్స్ భాగస్వాములిద్దరికీ మెరుగైన నిద్ర నాణ్యతను అందించవచ్చు. ఎలాంటి ఆటంకాలు లేని మరింత గాఢమైన, ప్రశాంతమైన నిద్రను పొందవచ్చు. అనుకూల వాతావరణం..కొందరికి ఏసీ ఆన్ ఉండాలి, కొందరికి వెచ్చగా ఉండాలి.
ఒకరికి లైటింగ్ ఉండాలి, మరొకరి చీకటిగా ఉండాలి. స్లీప్ డివోర్స్ వలన ఈ సమస్య ఉత్పన్నం కాదు. నిద్ర సమస్యల ఇబ్బంది ఉండదు..గురక, స్లీప్ అప్నియా, రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ వంటివి నిద్రకు అంతరాయం కలిగించే కొన్ని ఉదాహరణలు, ఇవి భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టవచ్చు. విడివిడిగా నిద్రించడం ద్వారా నిద్ర సమస్యల ఇబ్బంది ఉండదు. వ్యక్తిగత శ్రేయస్సు..వ్యక్తిగత శ్రేయస్సుకు నాణ్యమైన నిద్ర అవసరం. స్లీప్ డివోర్స్ వ్యక్తులు వారి నిద్ర అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి అవకాశమిస్తుంది, ఇది శమెరుగైన మానసిక స్థితి, మెరుగైన అభిజ్ఞా పనితీరుకు దారితీస్తుంది.
మెరుగైన సంబంధ సంతృప్తి..నిద్ర-సంబంధిత సవాళ్లను పరిష్కరించడం ద్వారా, భాగస్వాములిద్దరూ వారి జీవితంలోని ఇతర రంగాలలో మెరుగైన భావోద్వేగ కనెక్షన్, విభేదాలు లేని సామరస్యాన్ని అనుభవించవచ్చు. ఇబ్బందులేమి..స్లీప్ డివోర్స్ కొంతకాలం వరకు బాగానే ఉంటుంది. ఈ అలవాటు దీర్ఘకాలం కొనసాగితే ఇద్దరి మధ్య భావోద్వేగ సంబంధం దెబ్బతినవచ్చు. వారి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రావొచ్చు, శృంగారానికి దూరం కావచ్చు, సాన్నిహిత్యం దెబ్బతినవచ్చు. ఇవన్నీ ఇతర అనర్థాలకు దారితీయవచ్చు. స్లీప్ డివోర్స్ నిజమైన డివోర్స్ కు దారితీసినా ఆశ్చర్యం లేదు.