నిద్రలో గురక సమస్య వేధిస్తోందా..? ఇలా చేస్తే సులభంగా బయటపడొచ్చు.
గురక వల్ల పక్కన ఉన్నవాళ్లు నిద్రపోవాలని ప్రయత్నించినా నిద్ర పట్టదు. వినటానికి గురక సమస్య చిన్నదిగా అనిపించినా ఆ సమస్య వల్ల గురక పెడుతున్న వాళ్ల పక్కన పడుకునే వాళ్లు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఈ గురక వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు జరిగిన సందర్భాలు సైతం ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే నిద్రపోయే సమయంలో గాలి ముక్కుల నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గంలో అడ్డంకులు ఏర్పడినప్పుడు గురక వస్తుంది.
అలాగే ఈ సమయంలో నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. ఆ మార్గంలోనూ అవాంతరాలుంటే అప్పుడు కుచించుకుపోయిన మార్గం నుంచి గాలి వెళ్లాల్సి ఉండడంతో చుట్టుపక్కల ఉన్న కణజాలాలు కదలికకు గురై చప్పుళ్లు వస్తాయి. ఇది ఒక్క కారణం మాత్రమే. కానీ, వాస్తవంలో మరెన్నో అంశాలు ఉన్నాయి. ఇక ప్రధాన కారణం మానసికపరమైన ఒత్తిడి, కంగారు, విపరీతమైన ఆలోచనాధోరణి, అధిక బరువు. అల్లం.. అల్లంలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి.
అల్లంతో చేసిన పానియాలు తీసుకుంటే ప్రయోజనాలు కలుగుతాయి. కడుపు నొప్పి, దగ్గు, గుండె సమస్యలు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అల్లంలో యాంటీఇన్‌ఫ్లమేటరీ, యాంటీబాక్టీరియల్ ఏజెంట్స్ ఉంటాయి. ఇది గొంతును క్లియర్ చేస్తుంది. రోజుకు రెండుసార్లు అల్లం, తేనెతో టీ తాగితే ఫలితం ఉంటుంది. వెల్లుల్లి, ఉల్లిపాయ.. వెల్లుల్లి, ఉల్లిపాయ, ముల్లంగి.. తీసుకుంటే గురక సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ముక్కు పొడిబారకుండా రక్షిస్తాయి. ఇవి టాన్సిల్స్‌లో వాపును కూడా తగ్గిస్తాయి. స్లీప్ అప్నియాను నివారిస్తాయని ఒక అధ్యయనం పేర్కొంది. ఒకవేళ మీకు వీటి వాసన ప్రాబ్లమ్ లేకపోతే.. నిద్రపోయే ముందు ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లింగి తింటే గురక సమస్య తగ్గుతుంది.
లేదంటే.. రాత్రి భోజనంలో వెల్లుల్లి, ఉల్లిపాయ, ముల్లంగిని తింటే ఫలితం ఉంటుంది. అరటిపండు, పైనాపిల్, కమలాపండ్లు.. ప్రశాంతమైన నిద్ర గురక సమస్యను తగ్గిస్తుంది. శరీరంలో మెలటోనిన్ సరైన స్థాయిలో ఉత్పత్తి అయితే, ప్రశాంతంగా నిద్ర పడుతుంది. అయితే, మెలటోనిన్ కలిగిన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. మెలటోనిన్ కలిగిన వాటిలో అరటిపండు, పైనాపిల్, కమలాపండ్లు ముఖ్యమైనవి. వీటిని తినడం ద్వారా గురక సమస్యకు చెక్ పెట్టొచ్చు. సోయా పాలు.. పాల ఉత్పత్తుల్లో కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మరింత హానీ తలపెట్టొచ్చు.
అందుకే ఆవు, గేదె పాలు, పాల ఉత్పత్తుల బదులు.. ప్రోటీన్స్ కలిగిన సోయా పాలు తీసుకోవడం ఉత్తమం. వీటిని తీసుకోవడం వలన గురక సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. పుదీనా.. పుదీనా నిద్రలేమి సమస్యను, గురకను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతంది. ముక్కు దిబ్బడ, జలుబు, గొంతు నొప్పి, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. గోరువెచ్చని నీళ్లలో పుదీనా ఆకులను నానబెట్టి తీసుకోవాలి. బరువు తగ్గాలి.. గురక సమస్య ముఖ్యంగా అధిక బరువు ఉన్న వారిలో వస్తుంది. లావుగా ఉండే వారి శ్వాస మార్గం నిద్ర సమయంలో మరింత కుంచించుకుపోతుంది. తద్వారా గురక సమస్య తీవ్రమవుతుంది. అందుకే గురక సమస్యతో బాధపడేవారు బరువు ఉన్నట్లయితే.. బరువు తగ్గడానికి ప్రయత్నించాలి.