ఈ అలవాట్ల మార్చుకుంటే ఎలాంటి మందులు వాడకుండానే ఎసిడిటీ సమస్య తగ్గిపోతుంది.
కడుపులోని యాసిడ్ జీర్ణ వాహిక నుంచి పైకి రావడం వల్ల గొంతు అంతా మండినట్టుగా అవుతుంది. దీన్నే మనం ఎసిడిటీ అంటాం. ఎసిడిటీ అంటే గుండెల్లో, గొంతులో మంట, కడుపు నొప్పి, గ్యాస్, ఆహారం అరగకపోవడం, చెడు వాసన వంటివన్నీ ఇబ్బంది పెడతాయి. అయితే సాధారణంగా కడుపులో ఆసిడ్ అధికంగా ఉత్పత్తి అయినప్పుడు ఆసిడిటి సంభవిస్తుంది. ఫలితంగా, ప్రజలు గుండెల్లో మంట లేదా ఎగువ మధ్య ఛాతీలో నొప్పిని అనుభవిస్తారు. అతిగా తినడం, మసాలా ఆహారాలు ఎక్కువగా తినడం, తిన్నవెంటనే పడుకోవడం వలన ఈ ఆసిడిటీ అనేది సంభవిస్తుంది.
కొన్నిసార్లు కొన్ని ఔషధాల వాడకం కూడా ఆసిడిటిని కలిగిస్తుంది. కాబట్టి కారణం తెలిసినపుడు ఆసిడిటిని నివారించడం కూడా సులువు అవుతుంది. ఆసిడిటి అనేది తలెత్తకుండా ఉండాలంటే కొన్ని జీవనశైలి మార్పులు చేసుకోవాలి. దీనికి సమయం ఎక్కువ పట్టవచ్చు, అయినప్పటికీ ఆసిడిటీని శాశ్వతంగా నివారించవచ్చు. అలవాట్లలో మార్పులు.. ఆసిడిటికి ప్రధాన కారణం మీరు తీసుకునే ఆహార పదార్థాలు. పుల్లటి పండ్లు, కార్బోనేటెడ్ పానీయాలు, పిజ్జా బర్గర్స్, టొమాటో సాస్, చాక్లెట్స్, పిప్పరమెంట్, ఉప్పుకారాలు వంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు ఆసిడిటీ కలుగుతుంది.
కాబట్టి వీటిని తగ్గించాలి, అలాగే తిన్న వెంటనే హయిగా కూర్చోకుండా లేదా పడుకోకుండా చూసుకోండి. మీ రాత్రి భోజనం, నిద్రవేళకు మధ్య మూడు గంటల గ్యాప్ ఉండాలి. ఒకేసారి ఎక్కువగా తినేయకుండా కడుపులో కొంత ఖాళీ అనేది ఉండేలా చూసులోండి. అలాగే మీకు యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నప్పుడు కార్బోనేటేడ్ డ్రింక్స్ అస్సలు తీసుకోకూడదు. ఇది యాసిడ్‌ను నేరుగా అన్నవాహికలోకి పంపుతుంది. ఇంకా ఆసిడిటిని పెంచుతుంది. సాధారణ మంచి నీటిని తాగాలి, రోజుకి 5 లీటర్ల నీరు తాగాలని నిపుణులు సిఫారసు చేస్తారు. నిద్రించే ఎత్తు.. రాత్రివేళలో ఆసిడిటి కలగకుండా ఉండాలంటే, మీరు నిద్రిస్తున్నప్పుడు మీ తల మీ పాదాల కంటే ఎత్తుగా ఉండటం అనువైనదిగా పరిగణించవచ్చు.
సుమారు 6 నుంచి 8 అంగుళాల ఎత్తు ఉంటే సరిపోతుంది. దీని కోసం మీరు తలగడలు పేర్చుకోవచ్చు. లేదా అదనపు ఎత్తును పెంచుకోగలిగే ఎక్స్‌ట్రా-టాల్ బెడ్ రైజర్‌లను అమర్చుకోవచ్చు. అలాగే మీ రాత్రి భోజనంకు మీ నిద్రవేళకు మధ్య మూడు గంటల గ్యాప్ ఉండాలి. బరువు తగ్గడం.. మీరు అధిక బరువుతో ఉన్నట్లయితే, యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట వచ్చే అవకాశం గణనీయంగా పెరుగుతుంది.అందువల్ల మీ వయసు, ఎత్తుకు తగినట్లుగా ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండడానికి ప్రయత్నించండి.
ఇందుకు వ్యాయామాలు చేయండి, మీరు ప్రతి వారానికి కనీసం 3-4 సార్లు వ్యాయామం చేయడం లేదా వారాంతంలో అయినా చేయవచ్చు. సమతుల్య ఆహారం తినడం ద్వారా బరువు అదుపులో ఉంటుంది. ధూమపానం వదిలేయండి.. చాలా సందర్భాలలో ధూమపానం మానేయడం వలన ఆసిడిటి తీవ్రతను చాలా వరకు తగ్గిస్తుంది. ధూమపానం మానేయడం ద్వారా కూడా ఆసిడిటి సమస్య కూడా పూర్తిగా నయం అవుతుంది. ఎందుకంటే ధూమపానం వల్ల లాలాజలం ఉత్పత్తి తగ్గుతుంది. ఇది కడుపులో ఉత్త్పత్తి అయిన ఆమ్లంను అన్నవాహికలోకి ప్రవేశించేలా చేస్తుంది. అందుకే ధూమపానం చేసేవారికి గుండెల్లో మంట వచ్చే అవకాశం ఎక్కువ.