ఇన్‌ఫ్లూయెంజా H3N2 వైరస్ లక్షణాలు ఇవే, ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా..?
కోవిడ్ మహమ్మారి, దాని తదనంతర పరిణామాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో దేశంలో ఇన్‌ఫ్లుఎంజా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో దీర్ఘకాలిక అనారోగ్యం, దగ్గు వంటి లక్షణాలు ఎదుర్కొంటున్న చాలా మందిలో H3N2 ఇన్‌ఫ్లుఎంజా వైరస్ ప్రబలినట్లు నిర్ధారణ అయింది. అయితే H3N2 వైరస్ అనేది ఇన్‌ఫ్లూయెంజా-ఏ ఉప రకం వైరస్ . ఇది శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వైరస్ 1968లో మనుషుల్లో బయటపడింది. H3N2 అనేది ఇన్‌ఫ్లూయెంజా-ఏ వైరస్ యొక్క రెండు ప్రోటీన్ జాతుల కలయిక. ఈ వైరస్ హెబగ్లుటినిన్ , న్యూరామినిడేస్ యొక్క ప్రోటీన్ జాతుల నుంచి వచ్చింది. హెచ్‌ఏ (HA) అనేది 18కి పైగా విభిన్న ఉపరకాలను కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కటీ H1 నుంచి H18 వరకు ఉంటుంది.
ఇక NA కి 11 విభిన్న ఉపరకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటీ N1 నుంచి N11 వరకు ఉంటాయి.హెచ్3ఎన్2 వైరస్ లక్షణాలు..జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, తుమ్ములు, తలనొప్పి, చలి, గొంతులో గరగర, ముక్కు కారడం, అలసట, అతిసారం, వాంతులు, ఊపిరి ఆడకపోవడం వంటివి ఈ వైరస్ లక్షణాలు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. కొవిడ్ (Covid-19) తరహాలోనే ఈ వైరస్ కూడా ఒకరి నుంచి ఒకరికి చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఇంట్లో ఒకరికి వస్తే మిగతావారికీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను కలిసి వారి సూచన మేరకు మందులు వేసుకోవాలి. ఒకవేళ కేవలం జలుబు, దగ్గు ఉంటే మొదటి రెండు మూడు రోజులు వేచి చూడొచ్చు. కానీ, జ్వరం, విరేచనాలు కూడా మొదలైతే మాత్రం వెంటనే డాక్టరును కలవాలి.
ఈ వైరస్ సోకితే రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలి. మాస్క్ ధరించాలి. చేతుల్ని తరచూ సబ్బుతో కడుక్కోవాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇతరులకు వైరస్ సోకకుండా ఉంటుంది. మీరు తుమ్మినా లేదా దగ్గినా వైరల్ ఇన్ఫెక్షన్ ఇతరులకు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని మీ నోటిని, ముక్కుని మాస్క్‌తో కప్పుకోవడం మంచిది. వైద్యులు సూచించినట్లు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరిగితే వైరస్‌లను ఎదుర్కొనే వీలుంటుంది. గోరువెచ్చని నీరు తాగాలి. తాజా, వేడి ఆహారమే తీసుకోవాలి. యాంటీబయాటిక్స్ వేసుకోకూడదా..హెచ్3ఎన్2 వైరస్ మ్యుటేట్ అయింది. ఏటా ఇదే సమయంలో వైరస్ రూపాంతరం చెందుతూ వస్తోంది.
దీన్ని యాంటీజెనిక్ డ్రిఫ్ట్ అంటారు. గతంలో వచ్చిన H1N1 వైరస్ ఇప్పుడు H3N2గా రూపాంతరం చెందింది. ఈ వైరస్ కారణంగా వచ్చే దగ్గు కనీసం మూడు వారాలు ఉంటుంది. యాంటీబయాటిక్స్ వేసుకున్నా తగ్గదు. దీంతో రోగులు తీవ్ర గందరగోళానికి గురవుతారు. ఇలాంటి వైరస్‌లకు యాంటీబయాటిక్స్ తీసుకోకూడదని.. లక్షణాల మేరకు వైద్యులు చికిత్స చేస్తారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ఈ వైరస్ కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలిపింది. జలుబు, జ్వరం, దగ్గు వంటి సీజనల్ వ్యాధులకు యాంటీబయాటిక్స్ ఔషధాలు తీసుకోవడం సరికాదని పేర్కొంది.
జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, వికారం, వాంతులు, జ్వరం ఇవన్నీ సాధారణమేనని పేర్కొంది. సీజనల్ జ్వరం ఐదు నుంచి ఏడు రోజుల వరకు ఉంటుందని తెలిపింది. సాధారణ జ్వరం మూడు రోజుల్లో తగ్గిపోతుందని చెప్పింది. అయితే దగ్గు మాత్రం మూడు వారాల వరకు ఉంటుందని పేర్కొంది. రోగులకు యాంటీబయాటిక్స్ ఔషధాలు సూచించే ముందు సదరు ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా వల్ల వచ్చిందా? కాదా? అన్నది వైద్యులు నిర్ధారించుకోవాలని సూచించింది. లక్షణాల ఆధారంగా చికిత్స ఇవ్వాలని పేర్కొంది. ఈ దగ్గు, జలుబు వంటి వాటికి యాంటీబయాటిక్స్ అవసరం లేదని స్పష్టం చేసింది.