భర్తకు దగ్గరుండి మరీ మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు. ఈ భార్యలకు సలాం కొట్టాల్సిందే. ఎందుంటే..?
పెళ్లి శుభలేఖలు ముద్రించి.. తల్లి తండ్రి లేని తన భర్తకు పెళ్లి పెద్దలుగా మారి.. ఇంటింటికి వెళ్లి తమ భర్త మూడో పెళ్లికి రావాలంటూ ఆహ్వానం పలికారు. తమ కుటుంబంలోకి మరో గిరిజన యువతికి మనసారా ఆహ్వానించారు ఆ ఇద్దరు భార్యలు. తమ తోబుట్టువులా పెళ్లి చేశారు. ఇంతకీ అంత పెద్ద మనసు చాటుకొని తమ భర్తకు మూడో పెళ్లి చేయడం వెనుక గుండెలు పిండేసే ఓ వాస్తవం కూడా దాగి ఉంది. అందుకే ఇద్దరు భార్యలు పండన్న కలిసి.. ఒక నిర్ణయం తీసుకొని.. అందరి సమ్మతితోనే మూడో పెళ్లి చేసుకున్నాడు పండన్న. అందుకు ఆ ఇద్దరు భార్యలు ఆశీర్వదించారు.
అయితే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కించూరు గ్రామంలో ఉంటున్న సాగేని పండన్నకి పార్వతమ్మతో మొదటి పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఆమెను ఒప్పించి అప్పలమ్మ అనే ఆమెని రెండో వివాహం చేసుకున్నారు. ఇద్దరు భార్యల ముద్దుల మొగుడిగా ఉంటూ సంసార సాగరాన్ని ఈదుతున్నారు పండన్న. అలా వీరి కుటుంబం ఒక భర్త, ఇద్దరు భార్యలతో హ్యాపీగా సాగిపోతుంది. ఆ సమయంలో పండన్న జీవితంలోకి లక్ష్మీ అనే మహిళ వచ్చింది. పండన్న ఆమెపై మనసు పారేసుకున్నారు. పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు.
ఇదే విషయాన్ని తన భార్యలిద్దరికీ చెబితే వాళ్ళు అంగీకరించారు. ఈ పెళ్ళికి పెద్దలుగా ఆ ఇద్దరు భార్యలు ఉండడం విశేషం. పండన్నకు అమ్మానాన్న ఎవరూ లేకపోవడంతో భార్యలే పెళ్లి పెద్దలుగా మారారు. లక్ష్మీ ఇంట్లో పెద్దవాళ్ళని పండన్న భార్యలే ఒప్పించారు. లక్ష్మీ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. పెళ్లి ఖాయం అవ్వడంతో ముహూర్తం ఫిక్స్ చేసి శుభలేఖలు కూడా ముద్రించారు. పార్వతమ్మ, అప్పలమ్మ ఈ ఇద్దరూ తమ భర్త మూడో పెళ్ళికి ఆహ్వానిస్తున్నట్లు శుభలేఖలో ముద్రించారు. మీ రాకను ప్రేమతో ఆహ్వానిస్తున్నామని ముద్రించారు.
కాగా ఈ పెళ్లి జూన్ 25న ఉదయం 10 గంటలకు జరిగింది. నవ వధువు లక్ష్మీ తరపు బంధువులు, పాత వరుడు పండన్న బంధు మిత్రులు, గ్రామ పెద్దలు ఏ పెళ్ళికి వచ్చి దంపతులను ఆశీర్వదించారు. ఈ పెళ్లి కార్డు ఇప్పుడు బయటకు రావడంతో నెటిజన్స్.. ఎంత లక్కీ మావ నువ్వు.. ఇలాంటి భార్యలు ఉంటే నిత్యపెళ్లికొడుకులా ఉండచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.