తిరుమలలో మహిళలు పూలు పెట్టుకోరు, ఆ రహస్యం ఏంటో తెలిస్తే..?
శ్రీరంగం భోగమండపం, కంచి త్యాగ మండపం, తిరుమల పుష్ప మండపం అని చెబుతారు. పుష్పమండపం పేరుకి తగ్గట్టే శ్రీవారు పుష్పాలంకప్రియుడు. అందుకే శ్రీవేంకటేశ్వరస్వామి సేవకోసం నిత్యం టన్నుల కొద్దీ పూలను వినియోగిస్తుంటారు. కానీ కొండపై దర్శనానికి వెళ్లే భక్తులు మాత్రం తలలో పూలు పెట్టుకోకూడదని చెబుతారు. అయితే శ్రీవారు అలంకార ప్రియుడన్న విషయం విధితమే కదా. అందుకే కొండపై పూసిన పుష్పాలు.. ఆ వెంకటేశ్వరుడికే చెందాలనేది భక్తుల విశ్వాసం. అందుకే కొండపైన ఎవరూ పూలు పెట్టుకోరు. అయితే దీనికి పూరాణాల్లో మరో కథ ప్రచారం ఉంది.
ప్రాచీనకాలంలో వెంకన్నకు అలంకరించిన పువ్వులను భక్తులకు ఇచ్చే వారు. వారు ఆ పుష్పాలను పరమ పవిత్రమైనవిగా భావించి.. భక్తిశ్రద్ధలతో వాటిని తీసుకుని ఆడవాళ్లయితే తలలో, మగవాళ్లు చెవిలో పెట్టుకునేవారు. అయితే ఒకసారి శ్రీశైలపూర్ణుడు అనే ఓ పూజారి శిష్యుడు వెంకటేశ్వరస్వామి అలంకరణకు ఉపయోగించాల్సిన పువ్వులను తాను అలంకరించుకున్నాడట. ఇక ఆ రాత్రి శ్రీనివాసుడు.. ఆ పూజారి కలలో కనిపించి నీ శిష్యుడు పరిమళ ద్రోహం చేశాడని కన్నెర్ర చేశాడట. ఆ తదుపురి శ్రీశైలపూర్ణుడు ఎంతగానో మదనపడ్డాడు. అదిగో అప్పటి నుంచి… కొండపైన ఉన్న పుష్ప సంపద అంతా వెంకన్నకే చెందాలనే నియమం మొదలైంది.
అంతే కాదు.. స్వామికి అలంకరించిన పూవులను సైతం.. భక్తులకు ఇవ్వకుండా పూలబావిలో వేసే ఆచారం షురూ అయింది. అలంకార ప్రియుడైన శ్రీనివాసుడు ముందు భక్తుల అలంకరణలు ఏపాటివి చెప్పండి. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం ముందు భక్తులు సాధారణంగా కనిపించాలని గుర్తు చేసేందుకే పూలు పెట్టుకోకూడదన్న ఆనవాయితీ అమల్లోకి వచ్చింది. అంతే కాదు దేవాలయాలకు వెళ్లేటప్పుడు…. ఆడంబరాలకు పోకుండా… ఏకాగ్రతతో దర్శనానికి వెళ్తే మంచిదని ఆచార్యులు, వేద పండితులు చెబుతున్నారు. కాగా ప్రస్తుతం తిరుమలలో పూలబావిలో వేసిన పువ్వులతో… అగరువత్తులు తయారు చేస్తున్న విషయం తెలిసిందే.