Health

ఊబకాయంతో ఎన్ని అనారోగ్యసమస్యలు వస్తాయో తెలుసా..?

కుటుంబ చరిత్ర, జీవనశైలి, సమతుల్య ఆహారం లేకపోవడం స్థూలకాయానికి ప్రధాన కారణాలు. బాడీ మాస్ ఇండెక్స్-బిఎంఐ తెలుసుకోవడం ద్వారా ఊబకాయాన్ని గుర్తించవచ్చు. ఎత్తుకి మించిన బరువు వున్నట్లు తేలితే అది అనారోగ్యానికి దారితీస్తుంది. అయితే శరీరం బరువును సూచించే బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) అధికంగా ఉంటే ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. అన్ని వయసుల వారిలోనూ ఈ సమస్య కనపడుతోంది. పురుషుల కంటే మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. జన్యుపరమైన అంశాల వల్ల కొందరిలో అధిక బరువు సమస్య వస్తుంది.

అయితే గత దశాబ్ద కాలంగా చూసుకుంటే.. జీవనశైలి మార్పులతో ఊబకాయం సమస్య చాప కింద నీరులా విస్తరిస్తోందని నర్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. అధిక బరువు కారణంగా గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉందని పలు అధ్యయనాల్లో తేలింది. హార్మన్ల అసమతుల్యత, ఆహారపు అలవాట్లలో మార్పులు, ఆహార నియామాలపై అశ్రద్ధ వహించడం, వ్యాయామం చేయకపోవడం వల్ల ఒబేసిటీ సమస్య పెరిగిపోతుంది.

ఎక్కువ సమయం కంప్యూటర్ల ముందు కూర్చోవడం వల్ల కూడా ఒబేసిటీ పెరుగుతోంది. ఆటలు ఆడకపోవడం, తీవ్రమైన ఒత్తిడి వల్ల కూడా అధిక బరువు వచ్చే సమస్య ఉంది. అధిక బరువు ఎల్లప్పుడూ అనారోగ్య కారకమేనని పలు అధ్యయనాల్లో తేలింది. ఒబేసిటీ కారణంగా డయాబెటిస్, రక్త పోటు వచ్చే అవకాశం ఉందని వెల్లడైంది. ఇక కొలస్ట్రాల్ వల్ల గుండెకు అందే రక్త సరఫరాలో ఆటంకాలు ఏర్పడి గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు.

మోకాళ్ల నొప్పులు, థైరాయిడ్, పీసీఓడీ, గర్భాదారణలో సమస్యలు, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. అధిక బరువుతో చాలా మంది డిప్రెషన్ బారిన పడుతున్నారని పేర్కొన్నారు. అధిక బరువు బారిన పడకుండా ఉండాలంటే కొన్ని ఆరోగ్య సూత్రాలను పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. తక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ప్రతిరోజూ వ్యాయామంతో కూడా ఊబకాయానికి చెక్ పెట్టవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker