6 నెలలలోపు పిల్లలకు మంచినీరు తాగిస్తుంటారా..? మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో తెలుసుకోండి.
వేసవిలో విపరీతమైన వేడిలో, కొన్నిసార్లు తల్లులు, కుటుంబ సభ్యుల మనస్సులో ఒక ప్రశ్న ఉంటుంది. పిల్లవాడు నీరు తాగకపోతే అతనికి ఏ డీహైడ్రేషన్ సమస్య వస్తుందని. అయితే, వైద్యుల తెలిపిన వివరాల ప్రకారం, తల్లి పాలలో 80 శాతం నీరు ఉంటుంది. ఇది అవసరమైన అన్ని పోషణ, డీహైడ్రేషన్ సమస్యను తీరుస్తుంది. అయితే 6నెలల లోపు పిల్లలకు తల్లిపాలు లేదా పార్ములా పాలద్వారానే వారి శరీరానికి కావలసిన నీటి శాతం అందుతుంది.
దీనివల్ల పిల్లల శరీరం హైడ్రేట్ గానే ఉంటుంది. ఒక వేళ నీటిని పిల్లలకు ఇస్తే తల్లిపాలు లేదా ఫార్ములా పాల ద్వారా పిల్లలకు అందాల్సిన పోషకాలు అందకుండా పోతాయి. నీటిని తాగడం వల్ల పిల్లలకు ఎలాంటి శక్తి లభించదు. నీటిలో ఎలాంటి కేలరీలు ఉండవు. 6నెలల లోపు పిల్లలకు నీరు ఇస్తే అది పిల్లల ఎదుగుదలను ప్రభావితం చేస్తుంది. 6నెలల లోపు పిల్లలకు నీరు ఇవ్వడం వల్ల వారి శరీరంలో మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
ఏమవుతుందిలే కొద్దిగానే కదా ఇస్తున్నాం అనే నిర్లక్ష్యంతో ఎప్పుడూ పిల్లలకు నీరు ఇవ్వకూడదు. తల్లిపాలలో సహజంగానే 90శాతం నీరు ఉంటుంది. ఇది శరీరం హైడ్రేట్ గా ఉండటానికి సరిపోతుంది. ఇక ఇందులో పిల్లలకు కావలసినంత కేలరీలు, కొవ్వు, ప్రోటీన్లు అందుతాయి.
కానీ నీరు ఇవ్వడం వల్ల పిల్లలు ఈ పోషకాలు కోల్పోతారు. వేసవికాలంలో లేదా పిల్లలకు జ్వరం వచ్చిన సమయంలో వేడినీటిని స్పూన్లతో ఇస్తుంటారు. కానీ వైద్యుల సలహా లేకుండా అస్సలు నీరు ఇవ్వకూడదు. 6నెలల తరువాత మాత్రమే పిల్లలకు తేలికపాటి ఆహారం, అప్పుడప్పుడూ కొద్దిగా నీరు ఇవ్వవచ్చు.