చిరంజీవికి పద్మవిభూషణ్..?, ఆ రోజే అనౌన్స్‌మెంట్.
పద్మవిభూషణ్ అవార్డుకు చిరంజీవి ఎంపికైనట్లు తెలిసింది. చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డుపై రిపబ్లిక్ డే రోజు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం. మోదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలిసింది. అయితే మెగాస్టార్ చిరంజీవికి అవార్డులు కొత్త కాదు. ఎన్నెన్నో జాతీయ స్థాయి అవార్డులు వరించాయి. 2006లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. చిరంజీవి సాధించిన విజయాలు, సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తుగా ఏపీ ప్రభుత్వం 2016 రఘుపతి వెంకయ్య అవార్డు ప్రకటించింది.
ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో చిరంజీవిని 2022లో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.ఇంకా ఎన్నెన్నో అవార్డులు చిరంజీవి అందుకున్నారు. తెలుగు సినీ వినీలాకాశంలో చిరంజీవిది ప్రత్యేక స్థానం. చిత్ర పరిశ్రమలో ఒక సాధారణ నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన అనతి కాలంలోనే టాప్ హీరోగా ఎదిగారు. మెగాస్టార్ గా గుర్తింపు సాధించుకున్నారు.
మెగాస్టార్ కుటుంబం నుంచి నాగబాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్ వంటి హీరోలంతా ఎంట్రీ ఇచ్చారు. తెలుగు సినీ పరిశ్రమలో తమకంటూ ఒక గుర్తింపు సాధించుకున్నారు. సినీ పరిశ్రమలో తనకంటూ గుర్తింపు పొందిన చిరంజీవి రాజకీయాల్లో అడుగుపెట్టి.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. కానీ ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏర్పాటు చేసి క్రియాశీలక రాజకీయాలు చేస్తున్నారు. చిరంజీవి మళ్లీ సినిమా రంగంలో అడుగుపెట్టి వరుస విజయాలతో ముందుకు పోతున్నారు.
ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి చిరంజీవి సేవలను గుర్తించింది. 2024 రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల్లో చిరంజీవి పేరును పరిశీలించారు. త్వరలోనే మెగాస్టార్కు పద్మ విభూషణ్ అవార్డును ప్రకటిస్తారని వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో మెగా అభిమానుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రకటన కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.