కరోనా తర్వాత గుండెపోటుతో యువత ఆకస్మిక మరణాలు, వెలుగులోకి షాకింగ్ విషయాలు.

కొవిడ్ టీకాలు, గుండె పోట్లకు మధ్య సంబంధాన్ని తెలుసుకునేందుకు ఐసీఎంఆర్ నాలుగు వేర్వేరు అధ్యయనాలను నిర్వహించింది. కార్డియాక్ అరెస్ట్‌తో ఒక్కసారిగా కుప్పకూలిపోయి చనిపోతున్న ఘటనలపై పలు రకాల అధ్యయనాలు చేపట్టారు. అయితే కరోనా మహమ్మారి విజృంభించి లక్షల ప్రాణాలు పొట్టనపెట్టుకున్న తర్వాత దేశంలోని యువతలో ఆకస్మిక మరణాలు నమోదవుతున్నాయి.
ముఖ్యంగా గుండెపోటుతో ఆకస్మికంగా ఎక్కువ మంది యువత మరణిస్తున్నారు. అయితే ఈ మరణాలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ స్పందించారు. ఇందుకు గల కారణాలను నిర్ధారించేందుకు అవసరమైన ఆధారాలు ఇంకా అందుబాటులోకి రాలేదని తెలిపారు.
కొవిడ్ విజృంభణ తర్వాత పెరుగుతోన్న గుండెపోటు కేసులకు సంబంధించి వాస్తవాలను తెలుసుకోవడానికి భారత వైద్య పరిశోధనా మండలి మూడు అధ్యయనాలు చేస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. కొవిడ్ తర్వాత గుండెపోటు కేసులు పెరగడంపై లోక్‌సభ సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ విధంగా సమాధానమిచ్చారు.
దేశంలో 18 నుంచి 45ఏళ్ల యువకుల్లో ఆకస్మిక మరణాలకు దారితీస్తున్న అంశాలకు సంబంధించి బహుళ కేంద్రాల్లో సరిపోల్చే అధ్యయనం జరుగుతోందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 40 ఆస్పత్రులు/పరిశోధనా కేంద్రాల్లో ఇవి జరుగుతున్నాయని చెప్పారు.
2022లో దేశంలో 18 నుంచి 45ఏళ్ల వయసు వారిలో చోటుచేసుకున్న రక్తం గడ్డ కట్టుకుపోయే ఘటనలకు సంబంధించి దేశవ్యాప్తంగా దాదాపు 30 కొవిడ్ పరిశోధన ఆస్పత్రుల్లో మరో అధ్యయనం జరుగుతోందని వివరించారు.