News

ఇంటి నిండా గుట్టలు గుట్టలుగా కరెన్సీ నోట్లు, ఈడీకి అడ్డంగా దొరికిపోయిన అవినీతి బకాసురుడు.

మనీలాండరింగ్ విచారణలో భాగంగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఫ్ఎస్) అధికారి సుశాంత్ పట్నాయక్ ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ బుధవారం సోదాలు నిర్వహించింది. ఈ రైడ్స్ లో భారీగా డబ్బు బయటపడింది. సోదాలకు వెళ్లిన అధికారులకు దిమ్మతిరిగిపోయింది. అయితే హరిద్వార్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి సుశాంత్‌ పట్నాయక్‌ అటవీ భూముల కుంభకోణంలో నిందితుడుగా ఉన్నాడు. ప్రస్తుతం అతను ఉత్తరాఖండ్ కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

మనీలాండరింగ్‌కు పాల్పడ్డాడన్న ఆరోపణలపై బుధవారం కెనాల్‌ రోడ్‌లోని ఆయన నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. గురువారం తెల్లవారుజాము వరకు ఈ సోదాలు కొనసాగగా కోట్ల రూపాయల డబ్బు, నగలు, ఆస్తి పత్రాలు బయటపడ్డాయి. అయితే వాటి విలువ ఎంత అనేది ఈడీ అధికారికంగా వెల్లడించలేదు. కాగా ఈ రోజు ఈడీ ఢిల్లీ, ఉత్తరాఖండ్, చండీగఢ్‌లోని 17 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఉత్తరాఖండ్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్‌ ఇంటిపై కూడా దాడి చేసింది.

సోదాల విషయం తెలిసిన వెంటనే ఐఎఫ్‌ఎస్‌ ఉన్నతాధికారులు సుశాంత్‌ పట్నాయక్‌పై చర్యలు చేపట్టారు. తక్షణమే ప్రధాన కార్యాలయానికి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న మాజీ డివిజినల్‌ ఫారెస్ట్‌ అధికారి (DFO) ప్రస్తుతం పరారీలో ఉండగా.. ఆయన ఇంట్లోనూ సోదాలు జరిగాయి. ఫిబ్రవరి 3న జూనియర్ రీసెర్చ్ ఫెలో పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు పట్నాయక్‌పై కేసు నమోదైంది.

జనవరి 24న ఐటీ పార్క్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో పట్నాయక్ ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించాడని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశాల మేరకు ఈ విషయం వెలుగులోకి రావడంతో వెంటనే విచారణ చేపట్టారు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. పట్నాయక్ తండ్రి మృతికి సానుభూతి తెలిపేందుకు బాధితురాలు జనవరి 24న కార్యదర్శి కార్యాలయానికి వెళ్లింది. ఈ ఆరోపణలపై పట్నాయక్‌ను మీడియా ప్రశ్నించగా.. ఆయన సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker