ఈ కాలంలో ఖచ్చితంగా గోల్డెన్ మిల్క్ ఎందుకు తాగాలో తెలుసా..?

చలి రోజు రోజుకు పెరిగిపోతోంది. చలితీవ్రత పెరిగే కొద్దీ చాలా మంది అనేక జబ్బుల బారిన పడుతుంటారు. చలికాలంలో పసుపు పాలను తాగడం ప్రయోజనకరంగా ఉంటుందని పెద్దలు చెప్తుంటారు. అందుకే చలికాలంలో పిల్లలు, పెద్దలు పసుపు పాలను పక్కాగా తాగుతుంటారు. నిజానికి చలికాలంలో పసుపు పాలను తాగడం వల్ల దగ్గు, జలుబు, ఫ్లూ వంటి ఇతర అనారోగ్య సమస్యలను కలిగించే శీతాకాలపు వ్యాధికారక క్రిములకు వ్యతిరేకంగా పోరాడటానికి మన శరీరానికి శక్తి అందుతుంది.

అయితే చలికాలం అంటే కొంచెం బద్ధకంతో రోజు ప్రారంభమవుతుంది. ఉదయాన్నే శారీరక వ్యాయామం చేయడానికి వెనకడుగు వేస్తుంటారు. అలాగే ఈ కాలంలో చాలా మంది ఎలాంటి లిమిట్స్ లేకుండా ఆహారాన్ని తీసుకుంటుంటారు. ఇలాంటి చర్యల వల్ల జీర్ణ వ్యవస్థపై అదనపు భారం పడి వివిధ సమస్యలకు గురవుతుంటారు. శీతాకాలపు సమస్యల నుంచి బయటపడడానికి వైద్యులు కూడా వివిధ సూచనలు చేస్తుంటారు.

కానీ అవి పాటించడంలో లోపం వల్ల సమస్యలు మాత్రం పెరుగుతుంటాయి. అయితే పోషకాహార నిపుణులు శీతాాకాలంలో మరింత ఉత్సాహంగా ఉంటూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని కొత్త రెసిపీని చెబుతున్నారు. గోల్డెన్ మిల్క్ అని చెప్పే ఈ పాలను తాగడం వల్ల శీతాకాలం ఆరోగ్యంతో మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని పేర్కొంటున్నారు. అయితే గోల్డెన్ మిల్క్ ప్రీమిక్స్ తయారీ విధానం..

ఓ మిక్సీ జార్ లో నాలుగు టేబుల్ స్పూన్ల దాల్చిన చెక్క, రెండు టేబుల్ స్పూన్ల నల్ల మిరియాలు, మరో నాలుగు టేబుల్ స్పూన్ల అల్లం పొడి, అలాగే అర కప్పు పసుపు పొడిని తీసుకోవాలి. తర్వాత వీటిని మెత్తగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు, ఒక గ్లాసులో ఒక చెంచా ఈ ప్రీమిక్స్ వేసి, కొద్దిగా వేడి పాలు పోసి బాగా కలపాలి. ఇలా కలపడానికి హ్యాండ్ బ్లెండర్‌ను కూడా ఉపయోగించవచ్చు.

ఇలా బాగా కలిపిన పాలను తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబతున్నారు. అయితే పాలను ఇష్టపడని వారు ఈ ప్రీ మిక్స్ ను వేడి నీళ్లల్లో అయినా కలుపుకుని తాగవచ్చని సూచిస్తున్నారు. ఈ గోల్డెన్ మిల్క్ ప్రీమిక్స్ ఎనర్జీ బూస్టింగ్ కు పని చేస్తుందని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. అయితే తక్షణం రిలాక్స్ అవ్వడానికి, అలాగే వెంటనే శక్తిని తిరిగి పొందడానికి సాయం చేస్తుందంటున్నారు. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం సింపుల్ గా సిద్ధమయ్యే ఈ గోల్డెన్ మిల్క్ ఓ సారి మీరూ టేస్ట్ చేయండి.