Health

గుండెలో స్టంట్‌లు వేసిన మళ్ళీ గుండెపోటు ఎందుకు వస్తుందో తెలుసా..?

మారుతున్న కాలంతోపాటు మనిషి జీవన విధానం, ఆహారపు అలవాట్లలోనూ అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మన జీవితాల్ని సుఖమయం చేయడానికి అందుబాటులోకి వస్తున్న ఆధునిక సౌకర్యాలు, అత్యాధునిక సాంకేతికత ప్రత్యక్షంగాను, పరోక్షంగాను గుండెకు గునపపు పోట్లు పొడుస్తున్నాయి. ఒకప్పుడు 60-70 ఏండ్లు నిండిన వారిలోనే కనిపించిన గుండె సమస్యలు నేడు పాతికేండ్ల యువతలో కూడా బయటపడుతున్నాయి. అయితే గుండె సమస్యల వల్ల ఎంతో మంది స్టెంట్లు వేయించుకుంటారు. అలాగే రక్తాన్ని పలుచబరిచే మందులు కూడా వాడుతూ ఉంటారు. రక్తంలో పూడికలు ఏర్పడడం వల్ల ఇలా స్టెంట్లు వేస్తారు వైద్యులు.

అయితే ఎంతో మందికి ఉన్న సందేహం ఏంటంటే స్టెంట్లు వేసాక కూడా పూడికలు ఏర్పడే అవకాశం ఉందా? అని. వైద్యులు చెబుతున్న ప్రకారం స్టెంట్లు వేసాక కూడా ఐదు నుంచి పది శాతం మందికి స్టెంట్లు వేసిన చోట పూడికలు ఏర్పడే అవకాశం ఉంది. లేదా కొత్త ప్రదేశాల్లో కూడా పూడికలు ఏర్పడవచ్చు. స్టెంట్లు వేయించుకున్న తర్వాత ఎనిమిది నుంచి 12 నెలల లోపు తిరిగి పూడికలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారికి, మధుమేహం ఉన్నవారికి ఇలా స్టెంట్లు వేసాక కూడా పూడికలు వచ్చే అవకాశం ఉంటుంది. రక్తనాళంలో కొన్ని రకాల రియాక్షన్ల వల్ల కూడా స్టంట్‌లు పూడుకుపోవచ్చు.

అలాంటి సమయంలో వైద్యులు బెలూన్ యాంజియోప్లాస్టీ సహాయంతో పూడికని తొలగిస్తారు, లేదా అవసరమనుకుంటే మరొక స్టెంట్ కూడా వేస్తారు. కానీ పదేపదే స్టెంట్లు పూడుకుపోతుంటే మాత్రం బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. స్టెంట్లు వేయించుకున్న తరువాత కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు వైద్యులు. అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారు ఆ రెండింటిని అదుపులో ఉంచే మందులను క్రమం తప్పకుండా వేసుకోవాలి. అలాగే స్టెంట్ వేయించుకున్న తర్వాత రక్తాన్ని పలుచబరిచే మందులను వైద్యులు సూచిస్తారు. వాటిని కచ్చితంగా వాడాలి.

అలాగే కొవ్వు అధికంగా ఉండే ఆహారపు అలవాట్లను వదిలేయాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. వ్యాయామాన్ని చేస్తూ ఉండాలి. వైద్యుల సూచన మేరకు తేలికపాటి వ్యాయామాలే చేసుకోవాలి. ఒత్తిడికి గురవడం తగ్గించాలి. అధిక ఒత్తిడి వల్ల కూడా స్టెంట్లు కూడుకుపోయే అవకాశం ఉంది. గుండె జబ్బులు రాకుండా కొన్ని రకాల ఆహారాలను ముందు నుంచే తీసుకోవాలి. గుండెజబ్బులు బారిన పడిన తర్వాత కూడా ఇలాంటి ఆహారాలను తినడం వల్ల గుండెకు బలం చేకూరుతుంది. తృణధాన్యాలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి బార్లీ, మిల్లెట్స్, ఓట్స్, బీన్స్, పప్పులు, గోధుమలు వంటి వాటితో వండిన ఆహారాలను అధికంగా తింటూ ఉండాలి.

ఇక ఆకుకూరల్లో మెంతికూర, ముల్లంగి ఆకులు, బచ్చలి కూర, పాలకూర వంటివి అధికంగా తినాలి. ఇది గుండె జబ్బులు రాకుండానే కాదు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా అడ్డుకుంటాయి. దీనిలో కొవ్వు కేలరీలు తక్కువగా ఉంటాయి. అధిక మోతాదులో ఫైబర్ ఉంటుంది. ఇక పండ్ల విషయానికి వస్తే బెర్రీ పండ్లు గుండెకు మేలు చేస్తాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు వంటివి తింటూ ఉండాలి. అలాగే డార్క్ చాక్లెట్లు రోజుకో చిన్న ముక్క తినడం వల్ల మేలు జరుగుతుంది. అలాగని అధికంగా మాత్రం తినకూడదు. విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తింటూ ఉండాలి. బత్తాయిలు, నారింజలు తినడం అలవాటు చేసుకోవాలి. సోయాతో చేసిన ఆహారాలను కూడా తినాలి.

బయట సొయాతో చేసిన పనీర్ దొరుకుతుంది. దీన్నే టోఫు అంటారు. వీటిని వారానికి కనీసం రెండు సార్లు కూరలా వండుకొని తింటే మంచిది. బంగాళదుంపలకు కూడా తినవచ్చు. నిజానికి బంగాళదుంపలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. దీనిలో పొటాషియం అధికంగా ఉంటుంది. టమోటోలు ప్రతిరోజు ఆహారంలో ఉండేలా చూసుకోండి. దీనిలో కూడా పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. రోజూ గుప్పెడు నట్స్ తినడం అలవాటు చేసుకోవాలి. ఆ నట్స్ లో బాదం, వాల్నట్స్, వేరుసెనగ గింజలు ఉండేలా చూసుకోండి. వాటిలో విటమిన్ ఇ ఉంటుంది. విటమిన్ ఇ వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ చేరకుండా ఉంటుంది. దానిమ్మ పండును కూడా ప్రతిరోజూ తినేందుకు ప్రయత్నించండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker