మందుబాబులకు షాక్. దేశంలో మొదటిసారిగా లిక్కర్ అలర్జీ కేసు.

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా ప్రాంతం నుంచి వచ్చిన జాన్ అనే యువకుడికి ఆల్కహల్ అలర్జీ అయినట్లు తెలిపారు. కొన్ని వేల మందికి ఇలాంటి పరిస్థితి ఉండవచ్చని.. నిర్దారణ కాని పరిస్థితి ఉందని అలర్జి నిపుణులు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ పేర్కొన్నారు. అయితే జాన్ తన మిత్రులతో కలిసి ఓ పార్టీలో పాల్గొన్నాడని ఆ తర్వాత అందరూ కలిసి మద్యాన్ని సేవించారని నాగేశ్వర్ చెప్పారు. అయితే మందు బాబులకు మరో హెచ్చరిక.
మద్యం తాగితే లివర్ చెడిపోతుందని మాత్రమే ఇన్నాళ్లూ అనుకొనేవాళ్లకు నిజంగా ఈ వార్త షాకింగే. మద్యం తాగేవారికి ఎర్రటి దద్దుర్లతో ‘లిక్కర్ అలర్జీ’ అనే అరుదైన వ్యాధి సోకుతుందని చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఈ వ్యాధిబాధితులు చాలా తక్కువగా ఉన్నారు మరి. మనదేశంలో లిక్కర్ అలర్జీని ఇటీవల తొలిసారి హైదరాబాద్‌లోనే గుర్తించారు. ఆగ్రా నుంచి వచ్చిన జాన్ అనే ఓ యువకుడికి ఈ వ్యాధి ఉన్నట్టు నగరంలోని అశ్విని అలర్జీ సెంటర్ వైద్యులు గుర్తించారు.

ఇది చాలా అరుదైన వ్యాధి అని, మద్యం సేవించడం వల్ల కొంతమంది శరీరంలో అలర్జీకి సంబంధించిన మార్పులు కన్పిస్తాయని అలర్జీ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ తెలిపారు. ప్రపంచంలోనే ఈ తరహా కేసులు వందకు మించి ఉండవని చెప్పారు. జాన్ కొంతకాలం క్రితం ఓ విందులో మద్యం సేవించగానే, అతని ముఖం వేడిగా మారడంతోపాటు ఎర్రబడింది.
చర్మంపై దురదలు రావడం, ఛాతీ పట్టేసినట్టుగా ఉండటంతో దవాఖానలో చేరాడు. చికిత్స తర్వాత జాన్ ఆరోగ్యం మెరుగుపడ్డప్పటికీ రెండు నెలల తర్వాత మరోసారి మద్యం తాగటంతో గత పరిస్థితే ఎదురైంది. చాలా దవాఖానలు తిరిగిన జాన్, చివరకు హైదరాబాద్‌లోని అశ్విని అలర్జీ సెంటర్‌ను సంప్రదించాడు. డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ నేతృత్వంలోని వైద్యుల బృందం అతడిని పరీక్షించి అరుదైన ఆల్కహాల్ అలర్జీగా తేల్చింది.

మద్యం తాగేటప్పుడు నూనెలో వేయించిన మసాలా పల్లీలు, బఠానీలు, చికెన్, మటన్ రోస్ట్ వంటి హై హిస్టమిన్ ఫుడ్ తినడం వల్ల భయంకరమైన అలర్జీకి దారితీస్తుందని డాక్టర్ నాగేశ్వర్ వివరించారు. దీన్ని అశ్రద్ధ చేస్తే ప్రాణానికి కూడా ప్రమాదం వాటిల్లుతుందని చెప్పారు. మద్యం తాగినపుడు అలర్జీ వచ్చేవారు మద్యపానానికి దూరంగా ఉండటమే మంచిదని సూచించారు.