ఏ భంగిమలో నిద్రించాలి. ఏవైపు తిరిగి పడుకుంటే మంచిదో తెలుసుకోండి.
మనం రోజూ మంచం మీద ఎలా పడుకుంటున్నాం? ఏ పొజిషన్‌లో పడుకుంటున్నాం? అనేవి మన నిద్ర నాణ్యతను నిర్ణయిస్తాయి. అలాగే మన వెన్నెముక ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తాయి. అసలు ఏ పొజిషన్‌లో నిద్రపోవడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయనేది తెలుసుకుని ఉండటం ఆవశ్యకం. అయితే ప్రతి ప్రాణికి నిద్ర ఎంతో ముఖ్యం.. అదే ఆరోగ్యాన్ని, ఆయుష్షును పెంచేది.. సరైన నిద్ర ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. అలాంటి నిద్రకు ఎలాంటి భంగిమ మంచిది. ఏ వైపుకు తిరిగి పడుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తప్పక తెలుసుకోవాలి.
ఆరోగ్య నిపుణులు సైతం.. ఏ భంగిమలో నిద్రించాలి.. ఏ వైపు తిరిగి నిద్రిస్తే మంచిదో పలు సూచనలు చేస్తున్నారు. సాధారణంగా నిద్రించే సమయంలో చాలామంది ఎడమవైపు, కుడివైపు తిరిగి నిద్రిస్తుంటారు. మరికొంతమంది వెల్లకిలానూ, బోర్లా తిరిగి నిద్రిస్తుంటారు. కుడివైపునకు తిరిగి పడుకోవద్దని సూచిస్తున్నారు. ఎడమవైపు తిరిగి నిద్రిస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే.. కడుపులో ఎడమవైపు జీర్ణాశయం ఉంటుంది. అక్కడే క్లోమగ్రంథి కూడా ఉంటుంది. ఎడమవైపు తిరిగి నిద్రించిన సమయంలో భూగురత్వాకర్షణ శక్తికి లోనై వేలాడినట్టుగా ఉంటాయి.
అప్పుడు మీ జీర్ణ వ్యవస్థ చాలా చురుకుగా పనిచేస్తుంది. అంతేకాదు.. రోగనిరోధకత కూడా బలపడుతుంది. శోషరస వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. మధ్యాహ్నం ఆహారం తీసుకున్న తర్వాత ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఎడమవైపు తిరిగి పడుకోవాలట.. అలా పడుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. తిన్న ఆహారం కూడా చక్కగా జీర్ణమవుతుంది.. ఫలితంగా అజీర్ణ సమస్యలు, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
మరో విషయం ఏమిటంటే.. గుండె కూడా ఎడమవైపునే ఉంటుంది. అందుకే అటువైపు తిరిగి పడుకోవాలి.. అలా చేస్తే రక్త ప్రసరణ కూడా చక్కగా జరుగుతుంది. గుండెకు కొంతమేర విశ్రాంతి దొరుకుతుంది. అదే గర్భిణీలు అయితే కడుపులోని శిశువుకు నేరుగా పోషకాలు అందుతాయి. తద్వారా పిండానికి, గర్భాశయానికి రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది. ఇలా పడుకోవడంతో వెన్నెముక మీద ఒత్తిడి కూడా తగ్గుతుంది. మంచి నిద్ర పడుతుంది.
గర్భిణులు వీలైనంత సేపు ఎడమవైపు తిరిగి పడుకోవడం చాలా మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఒత్తిగిలి పడుకుంటే.. మోకాళ్లు దగ్గరికి మడిచి కాళ్ల మధ్యలో దిండు పెట్టుకోవాలి. ఇలా చేస్తే సుఖనిద్ర పడుతుంది. గురక సమస్య ఉన్నవారికి ఈ భంగిమ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ వైపు తిరిగి పడుకుంటే.. నాలుక, గొంతు సమాంతర స్థితిలో ఉంటాయి. తద్వారా శ్వాస సాఫీగా సాగుతుంది. గురక సమస్య కూడా తగ్గుతుంది. శ్వాస వ్యవస్థ కూడా చురుకుగా పనిచేస్తుంది.