పద్మశ్రీ అవార్డు అందుకోకుండానే ప్రముఖ గాయకుడు కన్నుమూత.
ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాలకు ధృపదాచార్య పండిట్ లక్ష్మణ్ భట్ తైలాంగ్ ఎంపిక అయ్యారు. మరి కొద్దిరోజుల్లో అవార్డును అందుకోవాల్సి ఉండగా .. ఈలోపే ఆయన మరణించడం ఎంతో ఆవేదనకు గురిచేస్తుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక ధృపదాచార్య పండిట్ లక్ష్మణ్ భట్ తైలాంగ్ తన జీవితం మొత్తాన్ని సంగీతానికే అర్పించారు. అయితే గత కొన్ని రోజులుగా న్యుమోనియాతో పాటు పలు వ్యాధులతో చికిత్స పొందుతున్న ఆయన రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న దుర్లబ్జీ ఆసుపత్రిలో శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు.
పండిట్ తైలాంగ్ కుమార్తె ప్రఖ్యాత ధృపద్ గాయని అయిన ప్రొఫెసర్ మధు భట్ తైలాంగ్ స్వయంగా ధృవీకరించారు. “గత కొన్ని రోజులుగా పండిట్‌జీ ఆరోగ్యం క్షీణించడంతో దుర్లబ్జీ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించాం. చికిత్స సమయంలోనే ఆయన ఆసుపత్రిలో శనివారం ఉదయం 9 గంటలకు తుది శ్వాస విడిచారు’ అని మీడియాకు తెలిపారు. కాగా జైపూర్‌కు చెందిన పండిట్ లక్ష్మణ్ భట్ తైలాంగ్ తన జీవితమంతా సంగీత సాధనకు అంకితం చేశారు.
ఆయన తన కుమారుడు రవిశంకర్‌తో పాటు కుమార్తెలు శోభ, ఉష, నిషా, మధు, పూనమ్, ఆర్తిలకు కూడా సంగీత పాఠాలు బోధించారు. తన పిల్లలతోపాటు అనేక మందికి వివిధ కళా ప్రక్రియల్లో ప్రావీణ్యులుగా తీర్చిదిద్దారు. పండిట్ తైలాంగ్ బనస్థలి విద్యాపీఠ్‌లో 1950 నంఉచి 1992 వరకు పనిచేశారు. అనంతరం జైపూర్‌లోని రాజస్థాన్ మ్యూజిక్ ఇనిస్టిట్యూట్‌లో సంగీత అధ్యాపకుడిగా 1991 నుండి 1994 వరకు కొనసాగారు. 1985లో జైపూర్‌లో ‘రసమంజరి’ పేరుతో ఒక సంగీతోపాసన కేంద్రాన్ని ఆయన స్థాపించారు.
అక్కడ ఎందరికో ఉచితంగా సంగీత విద్యను అందించారు. 2001లో జైపూర్-ధామ్‌లోని ‘అంతర్జాతీయ ధ్రుపద్-ధామ్ ట్రస్ట్’ని స్థాపించి, దానికి డైరెక్టర్‌గా కొనసాగారు. ఈ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సాయం అందించారు. కాగా జనవరి 26 పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో అత్యున్నత సేవలు అందించిన వారికి పద్మ అవార్డులు ప్రకటించింది. ఇందులో పండిట్ తైలాంగ్ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. అయితే ఈ అవార్డు అందుకోకుండానే మృతి చెందడంతో ఆయన అభిమానులతోపాటు పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.