Health

ఉప్పు ఎక్కువగా తీసుకునేవారికి వచ్చే ప్రాణాంతక వ్యాధులు ఇవే.

గత వారంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ సోడియం తీసుకోవడం ఎందుకు తగ్గించాలనే విషయంపై మొదటి-రకం నివేదికను వెల్లడించింది, 2025 నాటికి 30 శాతం సోడియం వినియోగాన్ని తగ్గించడంలో కృషి చేయాలని అన్ని దేశాలకు సూచనలు ఇచ్చింది. అయితే పలు దేశాలు తమ సూచనలు పట్టించుకోవడం లేదని భవిష్యత్ ఇది విపరీత పరిణామాలకు దారి తీస్తుందని హెచ్చరించింది. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 1.89 మిలియన్ల మరణాలు సోడియం అధికంగా తీసుకోవడంతో సంబంధం కలిగి ఉన్నాయని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది.

అయితే ఉప్పులేని కూర చప్పన.. అని వేమన అన్నాడు. చప్పనైనా పర్వాలేదు అధిక ఉప్పు తినకండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవును.. ఏ వంటకం అయిన సరే ఉప్పు తగిన మోతాదులో మాత్రమే వేసుకోవాలంటున్నారు. నిజానికి.. శరీర సమతుల్యత, కండరాలు-నరాల పనితీరును నిర్వహించడానికి ఉప్పు అవసరం. ఉప్పు శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. కానీ ఉప్పు ఎక్కువగా తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం.

ఆహారంలో ఉప్పు పెరిగితే రక్తపోటు పెరిగి.. గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. ఉప్పులో సోడియం ఉంటుంది. శరీరంలో సోడియం స్థాయిలు పెరిగే కొద్దీ నీటిని నిలుపుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. దీంతొ అధిక రక్తపోటు సమస్య ఏర్పడుతుంది. ఫలితంగా గుండె జబ్బులు, స్ట్రోక్, గుండె వైఫల్యం ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి ఆహారంలో ఉప్పును ఆచితూచి వేసుకోవాలి.

ఉప్పును ఎక్కువ మోతాదులో తీసుకుంటే, మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. కాలక్రమేణా, మూత్రపిండాల పనితీరు క్షీణించి, దెబ్బతింటాయి. ఉప్పు ఎక్కువగా తింటే శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. ఇది మీ చేతులు, పాదాలు, చీలమండలు, పాదాలలో వాపుకు కారణమవుతుంది. ఈ సమస్యను నివారించడానికి ఉప్పు వినియోగాన్ని తగ్గించుకోవాలి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రంలో కాల్షియం విసర్జించబడుతుంది.

ఫలితంగా శరీరంలో కాల్షియం స్థాయి తగ్గిపోతుంది. దీంతో ఎముకల సమస్యలు తలెత్తుతాయి. ఆర్థరైటిస్ ప్రారంభమవుతుంది. ఓ సర్వే ప్రకారం.. భారతీయులు సగటున రోజుకు 10 గ్రాముల ఉప్పును తీసుకుంటున్నారట. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే 2 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే, ఉప్పు ఎక్కువగా ఉండే ప్రాసెస్ చేసిన ఆహారాలకు కూడా దూరంగా ఉండాలంటున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker