News

టిక్ టాక్ శ్రీను విషాదాంతం, ఇతడి కష్టాలు పగోడికి కూడా రాకూడదు..!

టిక్ టాక్ శ్రీను.. ఇద్దరు పిల్లలు, భార్య, తల్లిదండ్రులతో సాఫీగా జీవితం సాగిపోతోంది.అయితే ఆ కుటుంబాన్ని చూసి విధికి కన్ను కుట్టింది ఏమో.. ఒక్కొక్కర్నీ మృత్యువు కబళించింది. చివరకు ఆ మనస్థాపంతో శ్రీను సైతం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయన విషాదంతో తల్లి, కుమార్తె అనాథలుగా మిగిలారు. అయితే టిక్ టాక్ వీడియోలతో టిక్ టాక్ శ్రీనుగా గుర్తింపు పొందాడు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఇతడు.. ఒంటరి తనం భరించలేక కొవ్వూరు రోడ్ కం రైలు బ్రిడ్జిపై నుండి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస్ సగ్గొండ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే సమయంలో ఒకప్పుడు యావత్ ప్రపంచాన్ని వీడియోలతో ఊపు ఊపేసిన టిక్ టాక్ పై దృష్టి సారించాడు. అతడు వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. అలా టిక్ టాక్ ద్వారా డబ్బులు, పేరు సంపాదించాడు. జీవితం సాఫీగా సాగిపోతుందని ఆనందించే లోపు.. ఇద్దరు పిల్లల్ని కొన్ని రోజుల తేడాతో కోల్పోయాడు శ్రీను.

ఇద్దరు పాము కాటుతోనే చనిపోవడంతో.. కన్నీరు మున్నీరు అయ్యారు తల్లిదండ్రులు. అయినప్పటికి ఓ బాలికను దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. అంతలో మరో విషాదం.. పిల్లలు చనిపోయారన్న దిగులు పడి.. అనారోగ్యం తెచ్చుకుని భార్య మరణించింది. ఇటు తండ్రి కూడా చనిపోవడంతో..ఒంటరి అయిపోయాడు. నలుగురి మరణాలు అతడ్ని కోలుకోకుండా చేశాయి. మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు వెంటాడాయి.

తల్లి, దత్తత కుమార్తెతో జీవనం సాగిస్తున్నాడు. కానీ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కొవ్వూరు రోడ్ కం రైలు బ్రిడ్జిపై బైక్ పార్క్ చేసి ఒక్కసారిగా గోదాట్లోకి దూకేశాడు. అక్కడే ఉన్న పడవ కార్మికులు గమనించి.. టిక్ టాక్ శ్రీనును నది నుండి సమీప ఘాట్ వద్దకు తీసుకు వచ్చారు. అయితే అప్పటికే మృతి చెందాడు శ్రీను. మృతుడి మేనల్లుడు పవన్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker