ఈ ఆయిల్స్ వాడితే జలుబు , తలనొప్పి, నడుంనొప్పి క్షణాల్లో తగ్గిపోతుంది.
జలుబు శ్వాసనాళం యొక్క పైభాగంలో వైరస్ దాడి చేయడం వల్ల కలిగే జబ్బు. ఇది ప్రధానంగా ముక్కు, గొంతు, స్వరపేటికను ప్రభావితం చేస్తుంది. వైరస్ సోకిన రెండు రోజుల లోపే దీని ప్రభావం మొదలవుతుంది. అయితే వాసనలతో రోగాలని నయం చేయడాన్ని అరోమా థెరపీ అంటారు. వాసనకుండే శక్తి అలాంటిది. వీటిలో వాడేవి ఎసెన్షియల్ నూనెలు. ఈ పరిమళభరితమైన నూనెల ప్రయోజనాలు బోలెడు . ఎసెన్షియల్ ఆయిల్స్ గురించి వినే ఉంటారు. పూలతో , వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వీటిని తయారు చేస్తారు.
ఇవి గాఢత ఎక్కువగా ఉండటం వల్ల వీటి వాసన పీల్చినా, చర్మానికి రాసుకున్నా ఎన్నో ప్రయోజనాలుంటాయి. మానసిక సాంత్వన, ఒత్తిడి తగ్గించడంలో, వాపులు, నొప్పులు తగ్గించడంలో.. ఇలా చాలా రకాల సమస్యలకి వీటిని వాడతారు. లావెండర్ నూనె..స్నానం చేసే నీళ్లలో ఈ నూనెను వేసుకోవడం మంచి నిద్ర పడుతుంది. ఒత్తిడిని, తలనొప్పి, కీళ్ల నొప్పులని తగ్గిస్తుంది. లేదంటే మామూలు కొబ్బరి నూనెలో కాస్త ఈ నూనె కలిపి నొప్పి ఉన్న చోట మర్దనా చేసుకోవచ్చు.
టీట్రీ నూనె..ఈ నూనెకు యాంటి సెప్టిక్, యాంటీ ఫంగల్ లక్షణాలున్నాయి. యాక్నె సమస్య ఉన్నవాళ్లు దూది ఉండను ఈ నూనెలో ముంచి నేరుగా రాసుకోవచ్చు. యాక్నె తగ్గుముఖం పడుతుంది. ఏవైనా దెబ్బలు తగిలి వాపు ఉన్న చోట ఏదైనా నూనెలో దీన్ని కలుపుకుని రాసుకున్నా ఉపశమనం ఉంటుంది. పెప్పర్ మింట్ నూనె..తలనొప్పి, నీరసం, ఆందోళన ఉన్నప్పుడు ఈ నూనె వాసన చూసినా లేదంటే కొబ్బరి నూనెలో కలిపి కాస్త తలకు రాసుకున్నా వెంటనే ఉపశమనం ఉంటుంది.
చుండ్రు సమస్య ఉన్నవాళ్లు రెండు చుక్కల పెప్పర్ మింట్ నూనెను కొబ్బరి నూనెతో కలిపి రాసుకుని ఒక పదిహేను నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ప్రయాణ సమయంలో వాంతులు, తల తిరగడం లాంటి సమస్యలుంటే ఈ నూనె వాసన చూస్తే వెంటనే కాస్త ఉపశమనం ఉంటుంది. నీలగిరి నూనె..శ్వాస సంబంధిత సమస్యలకు ఇది చక్కని పరిష్కారం. జలుబు వల్ల శ్వాసలో ఇబ్బంది ఉంటే రెండు చుక్కల నీలగిరి నూనె వేసి ఆవిరి పట్టుకోవాలి. వెంటనే సమస్య తగ్గుతుంది.
కీళ్ల నొప్పులుంటే ఈ నూనెను రాసుకుంటే ఫలితం ఉంటుంది. కానీ ఈ నూనెని నేరుగా కాకుండా కొబ్బరి నూనె లేదా ఇంకేదైనా నూనెతో కలిపి రాసుకోవాలని గుర్తుంచుకోండి. వీటిని ఎలా వాడాలి..ఇవి గాఢత ఎక్కువగా ఉండే నూనెలు కాబట్టి నేరుగా వాడకూడదు. అలాగే ఎక్కువ మోతాదులో వాడకూడదు. అలాగే వీటికి అలవాటు పడటం కూడా మంచిది కాదు. కేవలం అవసరమైనపుడు మాత్రమే ఉపయోగించాలి. ఆవిరి పట్టడం..వేడి నీళ్లలో రెండు చుక్కల నూనె వేసుకుని ఆవిరి పట్టడం ద్వారా ఆందోళన, ఒత్తిడి, తలనొప్పి లాంటి సమస్యలు తగ్గిపోతాయి.
దూది..జలుబు చేసినపుడు దూది ఉండ మీద ఈ నూనె వేసుకుని తీసుకెళ్లొచ్చు. అవసరమైనపుడు వాసనను చూడొచ్చు. డిఫ్యూజర్..గదిలో, కార్లలో వాసనలు వెదజల్లే డిఫ్యూజర్లుంటాయి. వాటిలో నూనెల్ని వేసుకోవచ్చు. చిన్న చిన్నగా వాసన వెదజల్లుతూ ఉంటుంది. మనసుకు హాయిగా ఉంటుంది. మర్ధన..కీళ్లనొప్పులు, చర్మ సంబంధిత వ్యాధుల కోసం వాడేటపుడు వీటిని నేరుగా కాకుండా కొబ్బరి నూనె, నువ్వుల నూనె.. ఇలా ఏదో ఒక నూనెతో కలిపి వాడాలి.