Health

అప్పుడప్పుడు వణుకు వస్తుందా..? ఈ ప్రమాదకరమైన జబ్బు వచ్చినట్లే..?

వణుకు అనేది ఒక విధమైన వ్యాధి లక్షణము. ఇది ఆ వ్యక్తికి తెలియకుండా జరిగే కండరాల కదలిక. ఇవి ఏ శరీర భాగానికైనా రావచ్చును; అయితే ఎక్కువగా మనం పనిచేసే చేతులలో కనిపిస్తాయి. అతిగా చలివాతావరణంలో కనిపించే తీవ్రమైన వణుకుతో పళ్ళు నూరడం కూడా చేస్తారు. కొన్నిసార్లు వణుకు నాడీ సంబంధ వ్యాధుల లక్షణంగా కనిపిస్తుంది. అయితే మన శరీరం ఏ పని చేయాలన్నా మెదడు నుంచి ఆదేశం రావాల్సిందే. అప్పుడే మనం నడవడం, మాట్లాడడం వంటివన్నీ చేయగలం.

ఇవన్నీ నియంత్రించే నాడీ వ్యవస్థ కు వచ్చే అనారోగ్యమే పార్కిన్సన్స్. మెదడులో ఉన్న నాడీ కణాలు నిరంతరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి. దీనికోసం కొన్ని రకాల రసాయనాలు సహాయం చేస్తాయి. అలాంటి రసాయనాల్లో డోపమైన్ కూడా ఒకటి. ఇది శరీర కదలికలను నియంత్రించే మెదడులోని ఒక భాగం నుంచి ఉత్పత్తి అవుతుంది. ఆ భాగం క్షీణించినప్పుడు డోపమైన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అప్పుడే పార్కిన్ సన్స్ వ్యాధి వస్తుంది. తల చేతులు వణికి పోతూ ఉంటాయి. శరీరం బిగుసుకుపోయినట్టు అవుతుంది. వేగంగా నడవలేరు.

సరిగా మాట్లాడలేరు. ఇది శారీరకంగానే కాదు మానసికంగా కూడా సమస్యలను తెచ్చిపెడుతుంది. భావోద్వేగ సమస్యలు వస్తాయి. అయితే ఈ వ్యాధిపై చాలా తక్కువ మందికే అవగాహన ఉంది. 60 ఏళ్లు నిండిన వారిలో సుమారు పది లక్షల మంది మనదేశంలో ఈ జబ్బుతో బాధపడుతున్నట్టు అంచనా. పార్కిన్ సన్స్ జబ్బు ఎప్పుడైనా, ఎవరికైనా రావచ్చు. అయితే ఆడవారితో పోలిస్తే మగవారిలోనే ఇది ఎక్కువగా వస్తుంది. ఇది ఎందుకు వస్తుందో మాత్రం ఇంతవరకు కనిపెట్టలేకపోయారు.

60 ఏళ్లు దాటిన వారిలోనే ఇది అధికంగా వస్తుంది. చాలా తక్కువ మందిలో 50 ఏళ్ల వయసులోపు వస్తూ ఉంటుంది. జన్యుపరమైన అంశాలు కూడా ఈ వ్యాధి రావడానికి కారణం కావచ్చు. అలాగే పురుగుల మందులు వాడడం, కాలుష్య కారకాల వంటివి కూడా ఈ వ్యాధి రావడానికి దోహదం చేస్తాయి. విటమిన్ డి లోపం వల్ల కూడా ఇది వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్యులు. ఈ వ్యాధి బారిన పడినవారు మానసిక వ్యాధుల బారిన కూడా త్వరగా పడతారు. డిప్రెషన్ లోకి వెళ్లే అవకాశం ఉంది. మతిమరుపు వస్తుంది. ఆహారం మింగడానికి ఇబ్బంది పడతారు.

మాట్లాడడానికి తడబడుతూ ఉంటారు. వాసన పీల్చే శక్తి తగ్గిపోతుంది. నిద్ర సరిగా పట్టదు. చేతిరాత మారిపోతుంది. ఈ వ్యాధికి ప్రత్యేక చికిత్స అంటూ ఏమీ లేదు. మెదడులో డోపమైన్ ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన మందులను సూచిస్తారు. అయితే ఆ మందుల వల్ల కాస్త వాంతులు, వికారం వచ్చినట్టు అనిపిస్తుంది. రక్త పోటు కూడా తగ్గుతుంది. వీటన్నింటినీ నివారించడానికి మరికొన్ని మందులను అందిస్తారు. పార్కిన్ సన్స్ వ్యాధి బారిన పడిన వారికి ఫిజియోథెరపీ చాలా ముఖ్యం. అలాగే వ్యాయామం కూడా రోజు చేస్తూ ఉండాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker