అయోధ్య రామయ్యకు అంబానీ ఫ్యామిలీ ఎంత విరాళం ఇచ్చారో తెలుసా..?
ఇప్పుడు పుణ్యమంతా అయోధ్యదే! యుగాలుగా వినుతికెక్కిన పుణ్యక్షేత్రం పేరు మరోసారి విశ్వ యవనికపై సువర్ణాక్షరాలతో ప్రతిష్ఠితమవుతున్నది. కల్పాంతాలకు వెరవని కల్పతరువు మరో సత్సంకల్పానికి వేదిక అవుతున్నది. ముముక్షువులు చేరి తరించాలనుకునే మోక్షనగరి.. తరలివస్తున్న రాఘవుడికి సుముహూర్తాంజలి ఘటిస్తున్నది. అయితే ప్రముఖ వ్యక్తులలో పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ , ఇండియన్ లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ సహా పలువురు అయోధ్య చేరుకొని అపూర్వ ఘట్టాన్ని తిలకించారు.
అయోధ్య రామయ్యకు పలువురు ప్రముఖులు భారీ కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఫ్యామిలీ భారీ విరాళం అందించారు. అంబానీ ఫ్యామిలీ తరఫున రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు రూ. 2.51 కోట్ల విరాళం ఇచ్చారు. బాల రామయ్య ప్రాణ ప్రతిష్ట చూడటానికి అయోధ్య వెళ్లిన ముఖేష్ అంబానీ, నీతా అంబానీ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ చూసినా జై శ్రీరామ్ నినాదాలు వినిపిస్తున్నాయని, జనవరి 22 దేశానికి రామ్ దీపావళి అని అన్నారు.
ఇది చారిత్రాత్మక ఘట్టం అని, చరిత్ర నిలిచిపోయే రోజు ఇది అని నీతా అంబానీ తెలిపారు. కోట్ల మంది ఆరాధించే అయోధ్య రామాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. బాల రాముడు.. అయోధ్యలో కొలువుదీరాడు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు 14 జంటలు, 4వేల మంది సాధువులు పాల్గొన్నారు. అలాగే దేశవ్యాప్తంగా వేల మంది సెలబ్రిటీలు ఈ అపూర్వ ఘట్టాన్ని కనులారా తిలకించారు. జనవరి 22, 2024 సాధారణ తేదీ కాదని.. కొత్త కాలచక్రానికి ప్రతీక అని ప్రధాని మోదీ అన్నారు.