News

ఎవరీ కందుల జాహ్నవి..? అసలు అమెరికాలో ఏం జరిగిందంటే..?

అమెరికాలో ఏపీకి చెందిన విద్యార్ధిని కందుల జాహ్నవి మృతి ఉదంతంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. జాహ్నవి మరణాన్ని అమెరికా పోలీసు అధికారి ఒకరు అపహాస్యం చేశారని వెల్లడైన నేపథ్యంలో మరికొన్ని విషయాలు తెలిశాయి. అయితే అమెరికాలోని సియాటెల్ లో పోలీసుల కారు ఢీకొని మరణించిన కందుల జాహ్నవి కేసు సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ ఘటన జనవరి 23న జరిగింది. ఆమె మరణంపై సియాటెల్ పోలీసులు చాలా హేళనగా మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించి వారి మాటలు బాడీ కెమెరాలో రికార్డు అవ్వడం.. అలాగే అందుకు సంబంధించి ఆ క్లిప్ లు బయట పడిన సంగతి తెలిసిందే.

అయితే ఈ నేపథ్యంలోనే ఈ కందుల జాహ్నవి ఎవరూ అన్న ఆసక్తి నెలకొంది. ఇంతకు అసలు ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. కందుల జాహ్నవి (23) ఆంధ్రప్రదేశ్ లోని నందిగామలో ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఆమెకు అమెరికాలోని సౌత్ లేక్ యూనియన్ లో ఉన్న నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ క్యాంపస్ లో సీటు వచ్చింది. అక్కడే మాస్టర్స్ డిగ్రీ చేసేది. అయితే స్టూడెంట్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్ లో భాగంగా జాహ్నవి 2021లో అమెరికాకు పయనమైంది.

జాహ్నవి తల్లి ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నారు. అంతేకాదు వాళ్ల కుటుంబానికి అప్పుల భారం కూడా పెరిగిపోయింది. అమెరికాలో ఉన్నత విద్య తర్వాత ఉద్యోగంలో చేరి అమ్మ చేసిన అప్పులు తీర్చాలనుకుంది జాహ్నవి. తన మొదటి ప్రాధాన్యత కుటుంబానికి సాయపడడమే అనే అనుకుంది. కానీ అంతలోనే ఊహించని ఘోరం జరిగిపోయింది. జనవరి 23న డెక్స్ టర్ అవెన్యూ నార్త్, థామస్ స్ట్రీట్ కూడలి వద్ద జాహ్నవి రోడ్డు దాటుతూ వెళ్తోంది. అయితే అదే సమయంలో అక్కడికి వేగంగా ఓ పోలీసు పెట్రోలింగ్ కారు దూసుకొచ్చింది.

ఏకంగా 119 కిలోమీటర్ల వేగంతో రోడ్డు దాటుతున్న జాహ్నవిని అకస్మాత్తగా ఢీకొట్టింది. దీంతో ఆ వేగానికి జాహ్నవి ఏకంగా 100 అడుగుల దూరంలో ఎగిరి పడిపోయింది. ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. చికిత్స కోసం హార్బర్ వ్యూ మెడికల్ సెంటర్‌కు తరలించారు. కానీ జాహ్నవి ప్రాణాలు విడిచింది. మరోవైపు ఆ ప్రమాదానికి బాధ్యులైన పోలీసులు తమ రేసీజాన్ని బయటపెట్టారు. జాహ్నవి ప్రాణాలు ఏమాత్రం విలువ లేదన్నట్లుగా చులకనగా మాట్లాడారు. 11 వేల డాలర్ల చెక్ రాసిస్తే సరిపోతుందిలే అంటూ హేళనగా మాట్లాడుకున్నారు

ఈ పోలీసు అధికారులుగా మాట్లాడుకున్న మాటలు వెలుగు చూశాయి. అయితే ఈ ఘటనపై భారత్ సీరియస్ అయ్యింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న భారత కాన్సులేట్ తీవ్రంగా స్పందించింది. ఇది చాలా దారుణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం సియాటెల్‌లోని స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని తమ అఫీషియల్ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. అలాగే ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్ష చేస్తామని హామీ ఇచ్చింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker