మీకు ఈ అలవాట్లు ఉంటే పిల్లలు పుట్టడం కష్టమేనా..? వెంటనే మీరు చేయాలంటే..?

ధూమపానం పురుషులు, స్త్రీలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది అండం, స్పెర్మ్‌లోని జన్యు పదార్థాన్ని దెబ్బతీస్తుంది. సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తుంది. పోగ తాగే పురుషుల స్పెర్మ్‌లో DNA దెబ్బతినడం, సంతానోత్పత్తికి తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే మన చుట్టూ ఉన్న ప్రపంచం నిరంతరం మారుతూనే ఉంది. అలాగే ప్రజల జీవనశైలి కూడా అందుకు తగ్గట్టు మారుతోంది. అలాగే వైద్యరంగంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. సాధ్యం కాదు అనుకున్న రోగాలను కొన్నింటిని నయం చేస్తున్నారు డాక్టర్లు. కానీ రోజు రోజుకు సంతానలేమి కేసులు మాత్రం బాగా పెరుగుతున్నాయి. పేలవమైన జీవనశైలి మన ఆరోగ్యాన్ని ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
దీనిలో సంతానోత్పత్తి కూడా ఉంది. మారుతున్న జీవనశైలి వల్లే భారతీయ మహిళలు, పురుషులు వంధ్యత్వం సమస్యను ఎదుర్కొంటున్నారని నిపుణులు చెబుతున్నారు. వైద్య నిపుణుల ప్రకారం.. ఆహారం, నిద్ర, ఎలా జీవిస్తున్నాం, ఇతర ప్రవర్తనా అలవాట్లు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే పురుషులు, మహిళల్లో వంధ్యత్వానికి కూడా ఇది వర్తిస్తుంది. సంతానోత్పత్తి ఒక వ్యక్తి వయస్సుపై ఆధారపడి ఉంటుంది. దీనిని నియంత్రించలేము. కానీ కొన్ని కారకాలు వంధ్యత్వ సమస్యను కలిగిస్తాయి. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పిసిఒఎస్), ఎండోమెట్రియోసిస్, ప్రారంభ అండాశయ వైఫల్యం, గర్భాశయం, అండాశయాలతో పుట్టుకతో వచ్చే సమస్యలు వంటివి కూడా వంధ్యత్వానికి దారితీస్తాయి.
అయితే వైద్యంతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ధూమపానం.. సిగరెట్లు తాగడం లేదా పొగాకును నమలడం వల్ల స్పెర్మాటోజెనిసిస్ అని పిలువబడే స్పెర్మ్ కణాల అభివృద్ధి ప్రక్రియ ప్రభావితమవుతుంది. ధూమపానం చేసే పురుషులకు తక్కువ స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ చలనశీలత సరిగ్గా లేకపోవడం, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. మహిళలు ధూమపానం చేయడం వల్ల మోనోపాజ్ త్వరగా ప్రారంభమవుతుంది. దీంతో వంధ్యత్వం సమస్య వస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్.. మందును ఎక్కువగా తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఇది స్థూలకాయం, సెమినల్ నాణ్యత తగ్గడం, తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు, వీర్యం పరిమాణం, స్పెర్మ్ కౌంట్ తగ్గడం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇది పురుషుల సంతానోత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అంతేకాదు దీర్ఘకాలిక ఆల్కహాల్ వాడకం వల్ల మహిళల హార్మోన్లు అసమతుల్యంగా మారుతాయి. ఇది క్రమరహిత అండోత్సర్గము లేదా ప్రారంభ రుతువిరతికి దారితీస్తుంది. గర్భనిరోధకాల వాడకం.. దీర్ఘకాలిక నోటి గర్భనిరోధకాలను వాడకం వల్ల స్త్రీ గర్భవతి అయ్యే సామర్థ్యం బాగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరంలో హార్మోన్ల అసమతుల్యతను కలిగిస్తాయి. దీంతో మహిళల రుతుచక్రానికి అంతరాయం కలుగుతుంది.
మానసిక ఒత్తిడి.. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అధిక మానసిక ఒత్తిడి, అధిక ఉష్ణోగ్రతలు, రసాయనాలు, రేడియేషన్ లేదా తీవ్రమైన విద్యుదయస్కాంత లేదా మైక్రోవేవ్ ఉద్గారాలకు ఎక్కువ కాలం గురికావడం వల్ల పురుషులు, మహిళలు ఇద్దరిలో సంతానోత్పత్తి సమస్యలు వస్తాయి. బరువు..పిల్లల్ని కనడానికి ప్రయత్నిస్తున్నవారు వయస్సు, ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. ఎందుకంటే తక్కువ బరువు లేదా అధిక బరువు సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. గర్భధారణ, ప్రసవ సమయంలో గర్భస్రావం, ఇతర సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే వంధ్యత్వం, అండాశయ పనిచేయకపోవడం తక్కువ బరువుతో ముడిపడి ఉన్నాయి.