ఊరికే త్రేన్పులు వస్తున్నాయి అంటే జాగ్రత్త, అది దేనికీ సంకేతమో తెలుసా..?
”బ్రేవ్” అనటాన్నే మనం ”త్రేన్పు” అంటున్నాం!ఇంగ్లీషులో బర్పింగ్ అంటాము. అసలు త్రేన్పు అనేది భోజన ప్రియులకు మాత్రమే రాదు, అందరికీ వస్తుంది. …కాకపోతే కాస్త ఎక్కువ తిన్న వాళ్ళకు ”బ్రేవ్” మనే శబ్దం ఎక్కువగా రావొచ్చు. అయితే పొట్టలో చేరిన వాయువులను బయటికి పంపించడమే ఈ త్రేన్పుల పని. ఇది ఒక రకమైన వాసనను కలిగి ఉంటాయి. అధికంగా త్రేన్పులు వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.
ఆహారం అధికంగా తీసుకున్నప్పుడు భుక్తాయాసం వల్ల కూడా పొట్టలో నుంచి గాలి త్రేన్పుల రూపంలో బయటికి వస్తుంది. అయితే త్రేన్పులు రావడానికి కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు. మనం ఆహారం తినేటప్పుడు లేదా నీళ్లు తాగేటప్పుడు కొంత గాలిని మింగేస్తాము. ఆ గాలి ప్రధానంగా నత్రజని, ఆక్సిజన్ మిళితంగా ఉంటుంది. అలాగే శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్, కార్బోనేటెడ్ పానీయాలు, బీర్ వంటివి తాగినప్పుడు కూడా అధికంగా త్రేన్పులు వచ్చే అవకాశం ఉంది.
పొట్టలో ఈ వాయువులన్నీ పేరుకుపోయి లోపల ఇమడలేకపోతాయి. వాటిని శరీరం బయటికి పంపించేస్తుంది. అలా బయటికి పంపే ప్రయత్నంలోనే త్రేన్పులు అధికంగా వస్తూ ఉంటాయి. ఈ గ్యాస్ బయటకు రాకపోతే పొట్టనొప్పి, ఉబ్బరం వంటివి కలుగుతాయి. కాబట్టి త్రేన్పులను ఆపుకోకూడదు. ఇది అధికంగా వస్తే పొట్ట ఆరోగ్యంగా లేనట్టు అర్థం. కాబట్టి కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. కొవ్వు నిండిన పదార్థాలు తినడం వల్ల పొట్ట ఉబ్బరం రావచ్చు.
ఎందుకంటే జీర్ణాశయం నుంచి ఆహారం పేగుల్లోకి వెళ్ళకుండా ఈ కొవ్వు అడ్డుకుంటుంది. అప్పుడు పొట్ట ఎక్కువ కాలం పాటు నిండుగా ఉంటుంది. ఆ సమయంలో లోపల ఉన్న గ్యాస్ బయటకి వచ్చే ప్రయత్నం చేసి త్రేన్పులుగా మారుతాయి. ఆహారాన్ని వేగంగా తినడం, తింటున్నప్పుడు అధికంగా మాట్లాడడం వంటివి జీర్ణాశయంలోకి గాలి చేరుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది. దీనివల్ల తేన్పులు అధికంగా వచ్చే అవకాశం ఉంది.
కాబట్టి ఆహారాన్ని నెమ్మదిగా తినాలి. కూల్ డ్రింకులు తాగాలనుకుంటే నేరుగా తాగాలి, కానీ స్ట్రా తో తాగకూడదు. పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలైన క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటివి కూడా శరీరంలో గ్యాస్ నిండేలా చేస్తాయి. కాబట్టి వీటిని తినేటప్పుడు కొద్ది మొత్తంలోనే తినాలి.