News

ఇండస్ట్రీలో మరో విషాదం, రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటి కన్నుమూత.

పవిత్ర జయరాం ప్రయాణిస్తున్న కారుకు తెలంగాణలోని మహబూబ్‍నగర్‌ జిల్లా భూత్పూర్ పరిధిలోని శేరిపల్లి వద్ద ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. నేటి తెల్లవారుజామున కారు డివైడర్ తాకి.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిందని సమాచారం. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పవిత్ర జయరాం కన్నుమూశారు. కారులో ఉన్న ఆమె కుటుంబ సభ్యులు, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. అయితే త్రినయని సీరియల్లో తిలోత్తమ పాత్రతో తెలుగు వారికి దగ్గరైన నటి పవిత్ర జయరాం. ఆదివారం బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా జరిగిన కారు ప్రమాదంలో ఆమె మృతి చెందింది.

ఆ తర్వాత ఆమె భర్త, నటుడు చల్లా చంద్రుగా పాపులర్ అయిన చంద్రకాంత్ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశాడు. ఇందులో తాను పవిత్రతో దిగిన చివరి ఫొటోను షేర్ చేయడం ప్రేక్షకులను మరింత కలిచి వేస్తోంది. “పాపా నీతో దిగిన చివరి పిక్ రా.. నువ్వు నన్ను ఒంటరివాడివి చేశాన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఒకసారి మామా అని పిలువే ప్లీజ్.. నా పవి ఇక లేదు. ప్లీజ్ మళ్లీ రావా” అనే క్యాప్షన్ తో అతడు ఈ ఫొటోను పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలో భర్తతో కలిసి పవిత్ర ఎంతో ఆనందంగా కనిపిస్తోంది. ఈ సెల్ఫీ, దానికి చంద్రకాంత్ రాసిన క్యాప్షన్ మనసును కలిచి వేసేలా ఉంది.

ఈ పోస్ట్ చూసిన ఇన్‌స్టా యూజర్లు చాలా మంది ఆమె తమ నివాళి అర్పిస్తూ.. చంద్రకాంత్ కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఈ కారు ప్రమాదంలో చంద్రు చేతికి, తలకు కూడా గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఎలా జరిగిందో కూడా అతడు మీడియాకు వివరించాడు. “ఇక్కడ షూటింగ్ కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్నాం. బెంగళూరులో భారీ వర్షాల కారణంగా మూడు గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరాం. నేను, పవి, ఆమె అక్క కూతురు కారులో వస్తున్నాం. డ్రైవర్ ఉండటంతో నేను నిద్రలోకి జారుకున్నాను.

అయితే అర్ధరాత్రి 12.30 ప్రాంతంలో ఓ ఆర్టీసీ బస్సు ఎడమ వైపు నుంచి ఓవర్టేక్ చేసింది. దీంతో మా డ్రైవర్ కుడివైపుకు తిప్పాడు. దీంతో కారు డివైడర్ ను తాకి ముందుభాగంలో విండ్ షీల్డ్ ముక్కలైపోయింది” అని చంద్రకాంత్ వివరించాడు. ఈ ప్రమాదంలో షాక్ కు గురైన పవిత్ర స్ట్రోక్ వల్ల చనిపోయిందని, గాయాల వల్ల కాదని కూడా చెప్పాడు. “ఈ ప్రమాదంలో నాకు తప్ప ఎవరికీ గాయాలు కాలేదు. అది చూసి పవిత్ర షాక్ కు గురైంది. ఆమెకు స్ట్రోక్ వచ్చి స్పృహ కోల్పోయింది. మేము హాస్పిటల్ కు వచ్చే సరికి ఒంటి గంట అయింది. ఉదయం 4 గంటల సమయంలో నాకు స్పృహ రాగా ఆమె చనిపోయిందని తెలిసింది” అని చంద్రకాంత్ తెలిపాడు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker