ఎక్కువ మందితో ఆ పని చేస్తే ఆ క్యాన్సర్ వస్తుందా..? పూనమ్ ప్రాణాలు పోవడానికి కూడా అదే కారణమా..?
గత కొంత కాలంగా సర్వైకల్ క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆమె తాజాగా ఆరోగ్యం క్షీణించి కన్నుమూశారు. సాధారణంగా మహిళల్లో క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్ మాత్రమే అందరూ గుర్తు చేసుకుంటారు. ఆ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) గుర్తొస్తుంది. నిజానికి, ఇది ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో వచ్చే నాలుగో అత్యంత సాధారణ క్యాన్సర్‌గా నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు అందరూ సర్వైకల్ క్యాన్సర్ గురించే మాట్లాడుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం నటి పూనమ్ పాండే మరణం. ఈమె సర్వైకల్ క్యాన్సర్ కారణంగా మరణించారు.
అలాగే బడ్జెట్ 2024 ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి ప్రస్తావించారు. బాలికలకు ఈ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించారు. దీంతో ఇప్పుడు అందరూ సర్వైకల్ క్యాన్సర్ గురించే చర్చించుకుంటున్నారు. గర్భాశయ ముఖద్వారం వద్ద వచ్చే క్యాన్సర్‌ను సర్వైకల్ క్యాన్సర్ అంటారు. సర్విక్స్ అనేది గర్భాశయానికి కింది భాగంలో ఉండే సన్నటి ప్రదేశం. ఇది గర్భాశయానికి ముఖ ద్వారంలా పనిచేస్తుంది. ఇది గర్భాశయాన్ని యోనితో కలిపి ఉంచుతుంది. మిగతా అన్ని క్యాన్సర్లతో పోలిస్తే గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ను సులభంగా నివారించవచ్చు.
దీనికోసం స్క్రీనింగ్ చేయించడం ఉత్తమ పరిష్కారం. చికిత్స కూడా చాలా సులభం. దీన్ని ఎంత ముందుగా గుర్తిస్తే అంత తేలిగ్గా చికిత్స చేయించవచ్చు. రొమ్ము క్యాన్సర్ తర్వాత మహిళలు అధికంగా ఎదుర్కొంటున్న సమస్య గర్భాశయ క్యాన్సర్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎక్కువగా హ్యూమన్ పాపిలోమా వైరస్‌తో సంబంధం కలిగి ఉంటుంది. ఎక్కువ కాలం ఈ వైరస్‌ను గుర్తించి నివారించకపోతే ఇది గర్భాశయ క్యాన్సర్‌కు దారి తీస్తుంది. స్క్రీనింగ్ టెస్ట్, HPV ఇన్ఫెక్షన్ నుండి రక్షించే వ్యాక్సిన్‌ని తీసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
తొలి దశ సర్వైకల్ క్యాన్సర్ ఎటువంటి లక్షణాలను చూపించదు. అయితే కొన్ని లక్షణాల ద్వారా దీన్ని గుర్తించొచ్చు. హెచ్‌పీవీ ద్వారా ఈ క్యాన్సర్ వస్తుందని అనుకోవచ్చు. మన శరీరంలోకి ప్రవేశించిన వైరస్ లేదా బ్యాక్టీరియాను తట్టుకోవడానికి యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతుంటాయి. కానీ హెచ్‌పీవీ వైరస్ విషయంలో మన శరీరం ఎలాంటి యాంటీబాడీస్‌ను తయారు చేయదు. కాబట్టి ఒక్కసారి ఇన్‌ఫెక్షన్ వస్తే అది జీవితాంతం ఉండిపోతుంది. అలా ఎక్కువ రోజులు దాన్ని గుర్తించకపోతే సర్వైకల్ క్యాన్సర్‌కు దారి తీస్తుంది. కాబట్టి హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఈ వైరస్ నుంచి రక్షణ పొందవచ్చు.
సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్‌స్మియర్ అనే పరీక్ష చేస్తారు. 21 ఏళ్లు నిండిన మహిళలతో పాటు, శృంగారంలో పాల్గొనడం ప్రారంభించి మూడేళ్లు దాటిన ప్రతి మహిళా క్రమం తప్పకుండా పాప్‌స్మియర్ పరీక్షలు చేయించుకోవాలి. సర్వైకల్ క్యాన్సర్ ముఖ్యమైన కారణాల్లో హ్యూమన్ పాపిలోమా వైరస్ ( HPV) ప్రధానమైనది. సగం జనాభా జీవితంలో ఏదో ఓ సందర్భంలో హెచ్‌పీవీ వైరస్ బారిన పడుతుంటారు. కానీ ఇది అందరిలోనూ గర్భాశయ క్యాన్సర్ దారి తీయదు. కొంతమందిలోనే ఇది క్యాన్సర్‌కు కారణమవుతుంది.