Spiritual: శివుడు ఆలయాన్ని నిర్మించి భక్తులైన బ్రిటిష్ దంపతులు..! వాళ్ళు ఎందుకు నిర్మించారో తెలుసా..?

Spiritual: ఆంగ్లేయులు..అగర్ మాల్వ అనే చోట ఒక దేవాలయాన్ని నిర్మించిన విషయం చాలా మందికి తెలియదు. తన భర్త ప్రాణాలు కాపాడటానికి పరమశివుడు స్వయంగా తిగివచ్చి, ఆఫ్ఘన్లతో యుద్ధం చేశాడని భావించిన ఒక ఆంగ్లేయ యువతి ఇక్కడ వైద్యనాథేశ్వర ఆలయాన్ని పున: నిర్మించింది. ప్రస్తుతం ఇది ప్రముఖ పుణ్యక్షేత్రంగా పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోంది. అయితే 1880లలో మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వాలోని ఒక శివాలయాన్ని లెఫ్టినెంట్ కల్నల్ మార్టిన్ పునర్నిర్మించారు. భారతదేశంలో ఒక ఆంగ్లేయుడు నిర్మించిన ఏకైక ఆలయం ఇది. కల్నల్ మార్టిన్ ఆఫ్ఘన్ యుద్ధం చేసేందుకు వెళ్ళాడు.
ఆ సమయంలో అతను తన భార్యకు క్రమం తప్పకుండా ఉత్తరాలు రాస్తూ అక్కడి పరిస్థితుల గురించి తెలియజేసేవాడు. అది చాలా కాలం యుద్ధం సాగింది. అయితే క్రమంగా కల్నల్ నుంచి భార్యకు ఉత్తరాలు రావడం ఆగిపోయాయి. ఆ సమయంలో మార్టిన్ భార్య అగర్ మాల్వా కంటోన్మెంట్‌లో నివసించే వారు. భర్త నుంచి ఉత్తరాలు రాకపోవడంతో భర్త గురించి ఆందోళన చెందింది. ఆమె ప్రశాంతంగా ఉండటానికి గంటల తరబడి గుర్రపు స్వారీ చేస్తూ గడిపేది. ఒకరోజు ఆమె తన గుర్రం మీద ప్రయాణిస్తూ వైద్యనాథ మహాదేవ ఆలయం దాటి వెళ్ళింది. అప్పుడు ఆ శివాలయం శిథిలావస్థలో ఉంది.
అయినా సరే ఆ ఆలయంలో హారతి ఇచ్చే సమయం, శంఖం శబ్దం. మంత్రాల జపం ఆమెకు వినిపించింది. దీంతో శివుని పూజను చూడటానికి ఆమె శివాలయం లోపలికి వెళ్ళింది. పూజారులు ఆమె ముఖంలో దుఃఖాన్ని చూసి ఏమి జరిగిందని అడిగారు. మార్టిన్ భార్య తన బాధను.. భర్త నుంచి ఉత్తరాలు రావడం లేదని.. ఎటువంటి విషయాలు తెలియడం లేదని ఆలయ పూజారికి వివరించింది. అపుడు దేవుడు భక్తులందరి హృదయ పూర్వక ప్రార్థనలను వింటాడని, క్లిష్ట పరిస్థితుల నుంచి భక్తులను రక్షిస్తాడని బ్రాహ్మణులు ఆమెకు చెప్పారు. పూజారులలో ఒకరు ఆమెకు “ఓం నమః శివాయ” అనే మంత్రాన్ని 11 రోజులు జపించడం ప్రారంభించమని సలహా ఇచ్చారు.
దీంతో కల్నల్ భార్యకు శివుడిని తన భర్త క్షేమం కోసం పూజించాలని కోరిక కలిగింది. దీంతో ఆమె తన భర్త కల్నల్ సురక్షితంగా తిరిగి రావాలని శివుడిని ప్రార్థించింది. అతను యుద్ధం నుంచి సురక్షితంగా ఇంటికి వస్తే ఆలయాన్ని పునర్నిర్మిస్తానని కోరుకుంది. శివాలయం నుంచి వచ్చిన మర్నాడు శివ పంచాక్షరీ మంత్రం “ఓం నమశ్శివాయ.. ఓం నమశ్శివాయ.” అంటూ జపించసాగింది. మరొక ధ్యాస లేదు. ఇలా ఓం నమశ్శివాయ .. ఓం నమశ్శివాయ అంటూ పదకొండో రోజు జపిస్తూనే ఉంది. 11 రోజు సాయంత్రం అవుతూ ఉండగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక సైనికుడు ఆమె భర్త నుంచి ఒక లెటర్ ని తీసుకుని వచ్చాడు.
ఆ ఉత్తరంలో నేను యుద్ధభూమి నుంచి నీకు క్రమం తప్పకుండా ఉత్తరాలు పంపుతున్నాను.. అయితే ఒక రోజు అకస్మాత్తుగా పఠాన్లు మమ్మల్ని చుట్టుముట్టారు. తప్పించుకునే మార్గం లేదు ఎందుకంటే మా దగ్గర ఆయుధాలూ తక్కువగా ఉన్నాయి. ఆహారమూ తక్కువగా ఉంది. వాళ్లు వందల సంఖ్యలో ఉన్నారు.. ఇక మా పని అయిపోయింది.. ఇదే చివరి రోజుని అని నేను భావించాను. అయితే ఇంతలో అకస్మాత్తుగా నేను పొడవాటి జుట్టుతో, పులి చర్మం ధరించి త్రిశూలం పట్టుకున్న ఒక భారతీయ యోగిని చూశాను. ఆయన్ని నేను అంతకుముందు ఎప్పుడూ చూడలేదు.. అతను విస్మయపరిచే వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ధాటికి అఫ్గన్లు కకావికలమైపోయారు. కాలికి బుద్ధిచెప్పి పారిపోయారు.
భయంతో మైదానం నుంచి పారిపోతున్న ఆఫ్ఘన్లపై తన ఆయుధాన్ని ప్రయోగించడం ప్రారంభించాడు. అతని దయ వలన మా ఓటమి విజయంగా మారింది. అప్పుడు గొప్ప యోగి నన్ను చింతించవద్దని.. నీ భార్య ప్రార్థనలకు చాలా సంతోషించి నన్ను రక్షించడానికి వచ్చానని చెప్పాడు. తర్వాత ఆయన ఎక్కడికి వెళ్లి పోయాడో ఏమైపోయాడో తెలియదని చెప్పాడు. ఈ ఉత్తరం చదువుతున్నప్పుడు మార్టిన్ భార్య కళ్ళలో ఆనందం, కృతజ్ఞతతో కన్నీళ్లు వచ్చాయి. ఆమె హృదయం ఉప్పొంగిపోయింది. ఆమె శివుని విగ్రహం పాదాలపై పడి ఏడ్చింది. కొన్ని వారాల తర్వాత లెఫ్టినెంట్ కల్నల్ మార్టిన్ తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పుడు అతని భార్య తన అనుభవాన్నిమొత్తం అతనికి చెప్పింది.
అప్పటి నుంచి ఈ బ్రిటిష్ దంపతులు శివ భక్తులు అయ్యారు. 1880 అఫ్గన్ యుద్ధం నుంచి తిరిగి వచ్చాక కల్నల్ మార్టిన్, ఆయన భార్య కొండమీద కొలువున్న బైద్యనాథ్ మహాదేవుడిని దర్శించుకున్నారు. 1883లో ఈ ఆలయాన్ని పునరుద్ధరించడానికి వారు రూ. 15,000 విరాళంగా ఇచ్చారు. అలా మహాదేవ మందిరానికి కొత్త శోభ వచ్చింది. ఈ సమాచారం విద్యనాథ్ మహాదేవ మందిరం ముందు ఉన్న శిలాఫలకంపై తమ కథను కల్నల్ మార్టిన్, ఆయన భార్య వ్రాయించారు.
మార్టిన్ దంపతులు తమ ఇంట్లో శివాలయం నిర్మించి, జీవితాంతం వరకు ఆయనను ప్రార్థించాలనే దృఢ సంకల్పంతో ఇంగ్లాండ్‌కు ప్రయాణించారు. అక్కడ కూడా ఈ దంపతులు తమ ఇంట్లో శివుడి విగ్రహం పెట్టుకున్నారు. మరణించే వరకూ శివయ్యని పుజిస్తూనే ఉన్నారు. ఆ మందిరం మధ్యప్రదేశ్ లోని షాజాపూర్ జిల్లాలోని అగర్ మాల్వాలో ఉంది. ఇదే మన దేశంలో బ్రిటిష్ వారు కట్టించిన ఏకైక ఆలయం.