సిగరెట్ తాగేవాళ్లకి గుడ్ న్యూస్, మీరు ఇలా చేస్తే కోటీశ్వరులైపోవచ్చు.
పొగ తాగే అలవాటుకు బానిసలైనవారు చాలా మంది ఈ అలవాటును మానేయాలని అనుకుంటారు. కానీ ఆ అలవాటును మానటం సాధ్యం కావడం లేదని చెబుతుంటారు. కొందరు సిగరెట్ కావాలని అలవాటు చేసుకోకపోయినా సరదాగా కాల్చడం వలనో, స్నేహితుల ముందు గొప్పలు పోవడానికో అలవాటు చేసుకుంటారు. సిగరెట్లు ఎక్కువగా తాగే వారికి ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సిగరెట్ తాగే అలవాటును దూరం చేసుకోవచ్చు. అయితే ఈ రోజుల్లో సిగరెట్,గుట్కా అలవాటు ఉన్నవాళ్ల సంఖ్య కంటే..అలవాటు లేనివాళ్ల సంఖ్యనే తక్కువ.
చాలామంది వీటికి అలవాటు పడడం వల్ల ఆరోగ్యం పాడవడమే కాకుండా ప్రతినెలా వారికి వేల రూపాయలు వృథా అవుతున్నాయి. ధూమపానం అనేది చాలా సాధారణ వ్యసనం, ఈ వ్యసనానికి బానిసలైన వాళ్లు రోజుకు దాదాపు రూ. 100-200 ఖర్చు చేస్తారు. కానీ ఈ చెడు అలవాటును వదిలి పొదుపు చేయడం ప్రారంభిస్తే దీర్ఘకాలంలో లాభదాయకంగా ఉంటుంది. ధూమపానం చేసేవారిలో చాలా మంది నెలలో 12-15 ప్యాకెట్ల సిగరెట్లు తాగుతారు.
సిగరెట్ ప్యాకెట్ ధర రూ.300గా పరిగణిస్తే నెలలో సిగరెట్స్ తాగడానికి అయ్యే ఖర్చు రూ.4,500. అదే సమయంలో ఏడాది వారీగా చూస్తే.. 12 నెలల్లో రూ.54 వేల విలువ చేసే సిగరెట్ తాగుతారు. భవిష్యత్తులో సిగరెట్లు,గుట్కాల ధరలు పెరిగితే వాటి మీద చేసే ఖర్చు కూడా పెరుగుతుంది. సిగరెట్లు లేదా గుట్కాల కోసం వెచ్చించే డబ్బును క్రమపద్ధతిలో పెట్టుబడి పెడితే మీరు కోటీశ్వరులు కాగలరు. ఆ డబ్బులను SIPలో ఇన్వెస్ట్ చేస్తే 30-40 సంవత్సరాల తర్వాత కోట్ల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్‌ను సృష్టించుకోవచ్చు.
పెట్టుబడి పథకం SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర బ్యాంకులో మ్యూచువల్ ఫండ్ అకౌంట్ తెరవడం ద్వారా పెట్టుబడిని ప్రారంభించవచ్చు. దీని తర్వాత మీరు ప్రతి నెలా ఈ అకౌంట్ లో నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD’s) మంచి రాబడిని ఇస్తాయి. దీనిలో మీరు జమ చేసిన మొత్తాన్ని కలపడం వల్ల కూడా ప్రయోజనం పొందుతారు.