Health

కౌమారదశలో ఉన్నవాళ్ళు వీటిని ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే..?

వాల్‌న‌ట్స్‌… చూసేందుకు ఇవి చిన్న‌పాటి మెద‌డు ఆకారంలో ఉంటాయి. కానీ ఇవి మ‌న శ‌రీరానికి అందించే ప్ర‌యోజ‌నాలు మాత్రం పుష్క‌లం. వాల్ నట్ తినడానికి చాలా మంది ఇష్టపడరు. ఎందుకంటే వాల్ నట్స్ బిట్టర్ టెస్ట్ కలిగి ఉంటాయి. ఇప్పుడు చెప్పే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే తప్పకుండ వాల్ నట్స్ తినటం అలవాటు చేసుకుంటారు. అయితే మెదడు పనితీరు బాగుండాలంటే రోజుకొక మూడు వాల్ నట్స్ తింటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇది ఇప్పుడు నిజమని మరోసారి రుజువైంది.

వారానికి కనీసం మూడు సార్లు కొద్దిపాటి వాల్ నట్స్ తినే అబ్బాయిలు, అమ్మాయిల్లో ఏకాగ్రత, అభిజ్ఞా పనితీరులో మెరుగుదల కనిపించాయని స్పానిష్ పరిశోధకుల నేతృత్వంలోని ఒక అధ్యయనం సూచిస్తుంది. అదీ కూడా కౌమారదశలో ఉన్న వాళ్ళు తింటే మానసిక పరిపక్వతకు దోహదపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరికీ కౌమారదశ చాలా కీలకమైనది. అబ్బాయి లేదా అమ్మాయి ఆలోచన విధానం ఎలా ఉంటుందనే దాని మీద దృష్టి సారించాల్సిన సమయం. ఇటువంటి కీలకమైన టైమ్ లో మెదడు ఆరోగ్యం, చదువు మీద శ్రద్ధ, ఏకాగ్రత చాలా ముఖ్యం.

అందుకోసం వాల్ నట్స్ చక్కగా పని చేస్తాయని మునుపటి అధ్యయనాలు వెల్లడించాయి. వాల్ నట్స్ లో ఆల్ఫా లినోలెనిక్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు అభివృద్ధిలో ముఖ్యంగా కౌమారదశలో ప్రాథమిక పాత్ర పోషిస్తాయి. కౌమారదశ అనేది జీవసంబంధమైన మార్పుల సమయం. హార్మోన్లలో మార్పులు జరిగే టైమ్ ఇదే. ఫ్రంటల్ లోబ సినాప్టిక్ పెరుగుదలను ప్రేరేపిస్తుంది. మెదడులో ఈ భాగం ఉంటుంది. ఇది పరిపక్వత చెందేందుకు న్యూరాన్లకు ఈ రకమైన ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉపయోగపడతాయి.

వాల్ నట్స్ లో ఉండే పోషకాలు బలమైన సినా ప్సెస్ ని ఏర్పరుస్తాయని పరిశోధకులు తెలిపారు. బార్సిలోనాలోని 12 వేర్వేరు ఉన్నత పాఠశాలల నుంచి 11-16 సంవత్సరాల మధ్య వయసు కలిగిన 700 మంది విద్యార్థుల బృందం ఈ అధ్యయనంలో పాల్గొంది. వారికి 30 గ్రాముల వాల్ నట్స్ ఉన్న సాచెట్ ని అందించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న యువకులు ఆరు నెలల పాటు ప్రతిరోజూ వాటిని తినాలని చెప్పారు.

కౌమారదశలో ఉన్న వాళ్ళు కనీసం 100 రోజుల పాటు వాల్ నట్స్ తిన్నారు. వారిలో శ్రద్ధ, ఏకాగ్రత పెరిగింది. అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD) లక్షణాలు ఉన్న వారి ప్రవర్తనలో గణనీయంగా మార్పులు చోటు చేసుకున్నాయని బృందం గుర్తించింది. నిపుణులు చెప్పిన మార్గదర్శకాలను అనుసరించిన వారిలో న్యూరోసైకలాజికల్ ఫంక్షన్లలో మెరుగుదల కనిపించినట్టు పరిశోధన బృందం తెలిపింది. వారానికి కనీసం మూడు సార్లు తింటే అభిజ్ఞా సామర్థ్యాలలో అనేక గణనీయమైన మెరుగుదల గమనించారు.

యుక్తవయసులో వచ్చే సవాళ్ళను ఎదుర్కోవడంలో వాల్ నట్స్ సహాయపడతాయి. వాల్ నట్స్ వల్ల మరిన్ని ప్రయోజనాలు.. డిప్రెషన్, ఒత్తిడి బారిన పడిన వాళ్ళు తరచూ వాల్ నట్స్ తింటే మానసిక ఆరోగ్యంపై ప్రభావవంతంగా పని చేస్తాయి. డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు రోజూ నాలుగు నట్స్ తినడం అలవాటు చేసుకోవాలి. దీని వల్ల రక్తంలో చక్కెరస్థాయిలు పెరగకుండా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ,బి6, కాపర్, సెలీనియం, మాంగనీస్ మొదలైన పోషకాలు లభిస్తాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker