మీకు ఎక్కువగా ఆకలేస్తోందా..? మీరు ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసుకోండి.

ఆకలి అంటే ఏదైనా తినాలి అనిపించే ఒక భావన. కాలేయములో గ్లైకోజన్ ఒక నిర్ధిష్ట స్థాయి కంటే తగ్గినప్పుడు కలిగే అనుభూతిని ఆకలి అంటారు. ఆకలి వేసిన వెంటనే తినవలెననే కోరిక కలుగుట సహజము. ఈ ఇబ్బందికరమైన అనుభూతి హైపోథాలమస్ నుండి ఉద్భవించి కాలేయములోని రిసెప్టార్స్ ద్వారా శరీరములోనికి విడుదల అవుతుంది. అయితే ఆకలి సర్వ సాధారణం. తినాల్సిన సమయం అయ్యిందని మన శరీరం మనకిచ్చే సంకేతం.
కానీ తిన్న వెంటనే కొద్దిసేపటికే ఆకలేయడం, తరచూ ఆకలిగా ఉండటం మాత్రం సరైంది కాదు. మీరు సరైన ఆహారం తీసుకోవట్లేదనీ, మీ జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందనీ అర్థం. లేదంటే కొన్ని సార్లు మీరు వేసుకుంటున్న మందులు కూడా ఆకలికి కారణం అవ్వొచ్చు. మనం రోజూవారీ చేసే కొన్ని తప్పులు కూడా తరచూ ఆకలికి కారణం కావచ్చు. రోజూవారీ తినే ఆహారం, పద్ధతుల్లో కొన్ని మార్పులు చేసుకుంటే తరచూ ఆకలి వేయకుండా మీకు కడుపు నిండిన భావన కలిగే అవకాశం ఉంది.

ఆ మార్పులేంటో తెలుసుకుందాం. అవసరమైనంత ప్రొటీన్ తీసుకోకపోవడం.. ప్రొటీన్లకు ఆకలి తగ్గించే గుణం ఉంటుంది. మన పొట్ట నిండుగా ఉన్నట్లు భావన కలిగించే హార్మోన్ల స్థాయుల్ని ప్రొటీన్లు పెంచుతాయి. ఆకలి పెంచే హార్మోన్ల స్థాయుల్ని తగ్గిస్తాయి. నిద్రలేమి.. సరిపోయేంత నిద్రకూ ఆకలికీ సంబంధం ఉంది. ఆకలిపెంచే గ్రెలిన్ హార్మోన్ స్థాయులకూ, నిద్రకూ సంబంధం ఉంటుంది. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు.. చిరుతిళ్లు, నూనెలో వేయించిన ఆహారంలో ఇవి ఎక్కువగా ఉంటాయి.

ఇలాంటి ఆహారంలో పీచు శాతం ఉండదు. దానివల్ల చక్కెర స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇది కూడా మీ ఆకలికి కారణం కావచ్చు. వాటికి బదులు కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోండి. ఫైబర్ తీసుకోకపోవడం.. అధిక ఫైబర్ తీసుకోవడం వల్ల మన శరీరంలోషార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది, దీని వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది.

ద్రవ రూప ఆహారం.. జ్యూసులు, షేక్ లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఆకలి తీరదు. ఎందుకంటే ఇవి ఆకలి తగ్గించే హార్మోన్లపై ప్రభావం చూపవు. వాటికన్నా ఘన రూప ఆహారాన్నే ఎక్కువ తీసుకోడానికి ప్రయత్నం చేయండి. ఒత్తిడి.. మానసిక ఆందోళన వల్ల ఒత్తిడి ఉంటుంది. దానివల్ల మన శరీరంలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది ఆకలి ఎక్కువయ్యేలా చేసే హార్మోన్.