సినీ నటి గౌతమి ఆస్తి కబ్జా చేసి.. చంపుతామంటూ బెదిరింపు కాల్స్.

తెలుగుతో పాటు తమిళ్, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది. బామ్మమాట బంగారు మూట, చైతన్య, అన్నా, పల్లెటూరి, శ్రీ వెంకటేశ్వర కల్యాణం, చిలక్కొట్టుడు, ద్రోహి.. తదితర తెలుగు సినిమాలు గౌతమికి మంచి పేరు తీసుకొచ్చాయి. అలాగే తన అభినయ ప్రతిభకు గుర్తింపుగా తమిళనాడు ప్రభుత్వం చేతుల మీదుగా పలు పురస్కారాలు తీసుకుంది. ఒకప్పుడు హీరోయిన్ గా తెలుగు తెరపై అనేక సినిమాల్లో నటించిన ఈమె.. క్రమంగా తమిళ ఇండస్ట్రీ వైపు మళ్లింది.
అక్కడ కూడా అనేక హిట్ సినిమాల్లో నటించింది. 90వ దశకంలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో భాగమైంది గౌతమి. అయితే ఆమె పర్సనల్ లైఫ్ మాత్రం మొదటినుంచే వివాదాస్పదంగా ఉండగా.. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. 1998లో సందీప్ భాటియా అనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుంది గౌతమి. అయితే ఈ కాపురం మూణాళ్ల ముచ్చటే అయింది. వీరిద్దరికి సుబ్బలక్ష్మి అనే కుమార్తె జన్మించిన తర్వాత 1999లో ఈ జంట విడాకులు తీసుకున్నారు.
అదే సమయంలో గౌతమికి క్యాన్సర్ వ్యాధి సోకడం.. ఆ తర్వాత కోలీవుడ్ టాప్ స్టార్ కమల్ హాసన్ ఆమెకు సాయం చేయడం లాంటివి జరిగాయి. కమల్ హాసన్ తో సహజీవనం చేసింది గౌతమి. అలా పుష్కరకాలం వీరి బంధం కొనసాగి చివరకు 2016లో విడిపోయారు. అప్పటినుంచి తన కుమార్తె తో కలసి జీవిస్తోంది గౌతమి. అయితే ఇప్పుడు గౌతమి మరో ఊహించని సమస్య తలెత్తింది. తను నమ్మిన ఓ వ్యక్తి గౌతమి ఆస్థి కబ్జా చేయడమే గాక ఎదురుతిరిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారట.
దీంతో పోలీసులను ఆశ్రయించింది గౌతమి. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేపడుతున్నారు. గౌతమికి తన సొంత ఊరు పెరంబూరు సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఆస్తులు ఉండగా.. వాటి విలువ దాదాపు 45 కోట్లు అని తెలుస్తోంది. అయితే రీసెంట్ గా ఆమెకు మళ్ళీ అనారోగ్యం సమస్యలు రావడంతో అందులో కొంత ఆస్తి అమ్మాలని చూసిందట. ఇందుకోసం అలగప్పన్ అనే ఏజెంట్ సాయం కోరగా.. అతను చివరకు మోసం చేశాడని పేర్కొంటూ గౌతమి ఫిర్యాదు చేసింది.
ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలు సృష్టించి ఆస్తి కొట్టేసే ప్రయత్నాలు చేయడమే కాకుండా.. రాజకీయ నాయకుల సపోర్ట్ తో తనను, తన కుమార్తెను చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది.