కోవిడ్-19 కంటే నిఫా వైరస్ ప్రమాదకరం, సంచలన విషయాలు చెప్పిన ICMR.

ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ 19 సోకినవారు మరణించే అవకాశం 2-3 శాతం మాత్రమే ఉండేదని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ భల్ తెలిపారు. కేరళలో ప్రస్తుతం ఒకే రోగి నుంచి ఈ వైరస్ వ్యాప్తి మొదలైందని చెప్పారు. స్థానికంగా నిపా వైరస్ వ్యాప్తి కట్టడికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
అయితే కోవిడ్ -19 మహమ్మారితో పోలిస్తే నిఫా వైరస్ సోకిన వారిలో మరణాల రేటు ఎక్కువగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహ్ల్ శుక్రవారం తెలిపారు. విలేకరుల సమావేశంలో బహ్ల్ మాట్లాడుతూ.. కోవిడ్ మరణాల రేటు రెండు నుండి మూడు శాతం ఉండగా, నిఫా మరణాల రేటు 40 నుండి 70 శాతం వరకు ఉంది.
కేరళ రాష్ట్రంలో ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఐసిఎంఆర్ డిజి చెప్పారు. కేసులు ఎందుకు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయో అధ్యయనం జరుగుతుందన్నారు. 2018లో గబ్బిలాల వ్యాప్తి కారణంగా ఈ వైరస్ కేరళలో వ్యాపించిందని తెలిసింది. ఇన్ఫెక్షన్ గబ్బిలాల నుండి మనుషులకు ఎలా సంక్రమిస్తుందో ఖచ్చితంగా తెలియలేదన్నారు.
సాధారణంగా వర్షాకాలంలో ఈ వైరస్ కేసులు పెరుగుతాయని చెప్పారు. వైరస్ వ్యాప్తిపై లోతైన పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. ICMR DG ప్రకారం.. నిఫా వైరస్ సంక్రమణ చికిత్స కోసం భారతదేశం ఆస్ట్రేలియా నుండి మరో 20 మోనోక్లోనల్ యాంటీబాడీలను కొనుగోలు చేస్తుంది. 2018లో ఆస్ట్రేలియా నుండి మోనోక్లోనల్ యాంటీబాడీస్ కొన్ని డోస్‌లను తీసుకున్నట్టుగా చెప్పారు.
ప్రస్తుతం డోసులు కేవలం 10 మంది రోగులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మరో 20 డోసులు సేకరిస్తున్నారు. ఈ వైరస్ సోకిన వారికి ప్రాథమిక దశలో మాత్రమే ఈ ఔషధం ఇవ్వనున్నట్టుగా చెప్పారు. ఇది అత్యవసర ఔషధంగా మాత్రమే ఇవ్వబడుతుందని చెప్పారు. యాంటీబాడీని ప్రపంచవ్యాప్తంగా 14 మంది రోగులకు విజయవంతంగా నిర్వహించగా భారతదేశంలో ఇప్పటివరకు ఎవరికీ మోతాదు ఇవ్వలేదని చెప్పారు.