ఘోర రైలు ప్రమాదం వేళా ప్రజల్లో వెల్లివిరిసిన మానవత్వం.

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ట్రిపుల్ రైలు ప్రమాదం ఇటీవలి చరిత్రలో భారతదేశంలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఒకటిగా ఉంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే చనిపోయిన వారి సంఖ్య 230 దాటింది. 900 మందికి పైగా గాయపడ్డారు. మరణాలు మరింతగా పెరిగే అవకాశముందని ప్రస్తుతం అందుతున్న నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే మానవత్వం వెల్లివిరిసింది.
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం అనంతరం క్షతగాత్రులకు సహాయ పడేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటనలో గాయపడిన వారికి రక్తదానం చేయడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కనీసం 280 మంది ప్రాణాలు కోల్పోగా, వెయ్యిమందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
బాలాసోర్ పట్టణంలో గాయపడిన వారి కోసం రక్తదానం చేయడానికి ప్రజలు బారులు తీరారు.తీవ్ర గాయాలతో రక్తం పోయిన వారికి దాతల నుంచి రక్తం తీసుకొని వారికి ఎక్కిస్తున్నారు. రైలు ప్రమాదం జరిగినపుడు తాను సంఘటన స్థలానికి సమీపంలోనే ఉన్నానని, దీంతో తాను ఇతరులతో కలిసి 300 మందిని రక్షించామని స్థానికుడు గణేష్ చెప్పారు.
శుక్రవారం రాత్రి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని, కోల్‌కతా నుంచి మరికొంత మంది ఆర్మీ సిబ్బంది రానున్నారని ఇండియన్ ఆర్మీ కల్నల్ ఎస్‌కే దత్తా చెప్పారు. 200 అంబులెన్స్‌లు, 45 మొబైల్ హెల్త్ టీమ్‌లు సంఘటనా స్థలంలో మోహరించినట్లు అధికారులు తెలిపారు.ఎస్‌సిబికి చెందిన 25 మంది వైద్యుల బృందంతో పాటు 50 మంది అదనపు వైద్యులను కూడా సమాయత్తం చేశారు.
శుక్రవారం రాత్రి నుంచి ఆరు బృందాలు పని చేస్తున్నాయని ఎన్డీఆర్‌ఎఫ్ సీనియర్ కమాండెంట్ తెలిపారు. గుర్తింపు పత్రాలు సమర్పించి మృతి చెందిన వారి కుటుంబాలకు మృతదేహాలను అప్పగిస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.గాయపడిన బాధితులు ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు శవపరీక్షలు కూడా ప్రారంభించారు.